అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల జంటగా, నాని కాసరగడ్డ దర్శకత్వంలో రూపొందిన 12ఏ రైల్వే కాలనీ సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. హార్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లకు చెందిన ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ కథ, మాటలు, కథనం అందించగా, దర్శకత్వ పర్యవేక్షణ కూడా ఆయనే చేశారు. అల్లరి నరేష్ ఈసారి సీరియస్ థ్రిల్లర్‌లో కనిపించడంతో ప్రేక్షకుల్లో ఊహలు పెరిగాయి. అయితే సినిమా మొత్తం ఎలా ఉంది? కథ, కథనం, నటన, టెక్నికల్ అంశాలు ఎలా వర్కౌటయ్యాయి? ఈ రివ్యూలో పూర్తి వివరాలు చూద్దాం.
కథ ఎలా ఉంది:
కార్తిక్ (అల్లరి నరేష్) వరంగల్ ప్రాంతానికి చెందిన యువకుడు. రాజకీయ నాయకుడు టిల్లు అన్న (జీవన్) దగ్గర పని చేస్తూ రోజువారీ పనుల్లో బిజీగా ఉంటాడు. ఇదే సమయంలో పక్కింట్లో ఉన్న ఆరాధన (కామాక్షి భాస్కర్ల) మీద ప్రేమ పెంచుకుంటాడు. తన స్టైల్ తో ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుండగా, ఒక రోజు ఆమెను, ఆమె తల్లిని ఎవరో దారుణంగా హత్య చేస్తారు. పోలీసులు కార్తిక్‌ను ప్రైమ్ సస్పెక్ట్‌గా పట్టుకుంటారు. కేసు ఇన్వెస్టిగేషన్‌కి వచ్చిన రానా ప్రతాప్ (సాయి కుమార్) సహాయంతో కార్తిక్ బయటపడతాడు. అసలు ఆ మర్డర్ వెనుక ఎవరు ఉన్నారు.? ఆరాధన మరణం ఎందుకు జరిగింది.? కార్తిక్ జీవితం ఎందుకు లక్ష్యంగా మారింది.? అనే అంశాలు మిగతా కథలో సస్పెన్స్‌గా కొనసాగుతాయి.
కథనం, దర్శకత్వం ఎలా పని చేశాయి:
ప్రచారంలో దర్శకులు చెప్పే మాటలు ఒకేలాంటి అంచనాలు పెంచుతాయి. 12ఏ రైల్వే కాలనీ విషయంలో కూడా ఇదే జరిగింది. అనిల్ విశ్వనాథ్ కథలో పలు ట్విస్టులు ఉంటాయని చెప్పినా, స్క్రీన్‌పై ఆ ఇంపాక్ట్ రావడం తక్కువే. ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకూ సినిమా నెమ్మదిగా సాగుతుంది. కథ ఎక్కడికీ కదలకపోవడం వల్ల ఫస్టాఫ్ కొంత బోర్‌గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ వద్ద ఒక బలమైన ట్విస్ట్ ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకు ఓకే లెవల్‌లో ఉన్న ట్విస్ట్ మాత్రమే కనిపిస్తుంది.
సెకండాఫ్‌లో మళ్లీ అదే పాత మోడ్‌లో కథనం కొనసాగుతుంది. పునరావృత సీన్లు, ట్రాక్ తప్పిన స్క్రీన్‌ప్లే, ఎక్కడో వినిపించినట్టున్న ట్విస్టులు మొత్తం సినిమాలో కొత్తదనం తగ్గిపోయింది.. దర్శకుడు చెప్పినట్లు ప్రతి 10 నిమిషాలకు ట్విస్ట్ ఉంటుందని భావించినా, చాలా ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యపరచవు. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే ఎంతగానో హైలైట్ చేస్తూ వచ్చినా, స్క్రీన్‌పై చూసినప్పుడు ప్రత్యేకంగా అనిపించదు.
అల్లరి నరేష్‌ను కామెడీ జోనర్‌కు పరిమితం చేయకుండా కొత్త కథలు ప్రయత్నించడం మంచిదే. కానీ ఆయనకు సరిపడే స్ట్రాంగ్ స్క్రిప్ట్ అందితేనే ఇలాంటి థ్రిల్లర్లు బాగానే వర్కౌట్ అవుతాయి. ఈ కథ మాత్రం ఆయన యాక్టింగ్ ఉన్నప్పటికీ అంత ప్రభావం చూపలేకపోయింది.
నటీనటుల ప్రదర్శన:
అల్లరి నరేష్ ఎప్పుడు ఉన్నా నటన పరంగా తన బెస్ట్ ఇస్తాడు. ఈ చిత్రంలో కూడా ఆయన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. కామాక్షి భాస్కర్ల పాత్ర చిన్నదైనా, తనవంతు పనిని బాగా చేసింది. జీవన్, గెటప్ శ్రీను, వైవా హర్ష వంటి నటులు తమ పాత్రల్లో సహజంగా కనిపించారు. సాయికుమార్ పోలీస్ పాత్రలో పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ చూపించారు.
టెక్నికల్ అంశాలు:
కెమెరామేన్ కుశేందర్ రమేష్ రెడ్డి పని సినిమా లుక్‌ని సెటిల్ చేశాడు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు లెవెల్ జోడించింది. పాటలు కూడా బాగానే వినిపించాయి. ఎడిటింగ్ కాస్త క్రిస్ప్‌గా ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ, పర్లేదనిపిస్తుంది. కాశ్మీర్‌లో షూట్ చేసిన ఎపిసోడ్ మాత్రం కథకు పెద్దగా కనెక్ట్ కాకపోయినా విజువల్‌గా ఆకర్షణీయంగా ఉంది. మొత్తం మీద టెక్నికల్ టీమ్ పనితనం బాగానే ఉంది కానీ కథ బలం లేకపోవడంతో ప్రభావం తగ్గిపోయింది.
ముగింపు:
మొత్తం మీద 12ఏ రైల్వే కాలనీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌గా మంచి అవకాశాలు ఉన్నా, బలహీనమైన స్క్రీన్‌ప్లే, పునరావృత సీన్లు, అసంతృప్తికర ట్విస్టుల వల్ల ఆకట్టుకోలేకపోయింది. అల్లరి నరేష్ నటన, సంగీతం, కొన్ని విజువల్స్ తప్పితే సినిమాకు ప్రత్యేకంగా నిలిచే అంశాలు తక్కువగా ఉన్నాయి. థ్రిల్లర్ అభిమానులకు కొంతవరకు ఓకే కానీ కొత్తదనం కోసం వెతికేవారికి మాత్రం ఇది సరిగా పనిచేయని చిత్రం.