బంగ్లాదేశ్ (Bangladesh)లో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత, అల్లర్లు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తాజాగా మైమెన్‌సింగ్ (Mymensingh) ప్రాంతంలో ఒక హిందూ వ్యక్తిపై జరిగిన మూకదాడి (Lynching) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణ ఘటనపై చీఫ్ అడ్వయిజర్ ముహమ్మద్ యూనస్ (Muhammad Yunus) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం (Interim Government) తీవ్రంగా స్పందించింది. ఈ నేరానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.
యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం (Shafiqul Alam) ఫేస్‌బుక్ (Facebook) వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. మైమెన్‌సింగ్‌లో హిందూ వ్యక్తిపై జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. కొత్త బంగ్లాదేశ్‌లో హింసకు, విద్వేషాలకు ఎలాంటి స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు, వదంతులకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆస్తుల విధ్వంసం, ప్రాణనష్టం కలిగించే చర్యలను ప్రభుత్వం సహించబోదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, గత వారం ఢాకా (Dhaka)లో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన యువ నాయకుడు ఉస్మాన్ హదీ (Usman Hadi) సింగపూర్ (Singapore) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ వార్త వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతమయ్యాయి. హదీని అమరవీరుడిగా అభివర్ణించిన ముహమ్మద్ యూనస్ గురువారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. హదీ మరణం హృదయవిదారకమని, ఆయనను హతమార్చిన వారిని తప్పకుండా చట్టం ముందు నిలబెడతామని యూనస్ హామీ ఇచ్చారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
అల్లరి మూకల ఆగ్రహం మీడియా సంస్థలపై కూడా పడింది. ప్రముఖ దినపత్రికలు డైలీ స్టార్ (Daily Star), ప్రథమ్ ఆలో (Prothom Alo) కార్యాలయాలపై దాడులు చేసి నిప్పు పెట్టారు. జర్నలిస్టులు ప్రాణభయంతో తప్పించుకున్నారు. ఈ పత్రికలు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయనే ఆరోపణలే దాడులకు కారణమని సమాచారం. జర్నలిస్టులపై దాడి చేయడం సత్యాన్ని అణచివేయడమేనని ప్రభుత్వం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో భారీగా పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించింది.