సుమారు ఏడాది గ్యాప్ తర్వాత ఓ మలయాళం థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. అంతేకాదు, ముందస్తు ప్రకటన లేకుండానే తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) నటించిన డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ (Dominic and the Ladies Purse) సినిమా తాజాగా డిజిటల్ ప్రీమియర్ సాధించింది. ఈ సినిమా శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులో ఉండటం విశేషం.
సాధారణంగా బహుభాషల స్ట్రీమింగ్‌కు ముందే ఓటీటీ సంస్థలు సమాచారం ఇస్తుంటాయి. కానీ ఈ సినిమాకు సంబంధించి తెలుగులో స్ట్రీమింగ్ గురించి ముందుగా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. సడెన్‌గా తెలుగులో కనిపించడంతో సినీ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. థియేటర్లలో రిలీజైన దాదాపు 11 నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రావడం కూడా ఆసక్తికరంగా మారింది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, ఓటీటీలో మాత్రం థ్రిల్లర్ లవర్స్ నుంచి మంచి ఆసక్తి కనిపిస్తోంది.
డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా 2025 జనవరి 23న థియేటర్లలో విడుదలైంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. గోకుల్ సురేష్ (Gokul Suresh), సుష్మిత భట్ (Sushmitha Bhatt) ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌పై స్వయంగా మమ్ముట్టి నిర్మించడం మరో ప్రత్యేకత. క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ, కథలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను పలువురు ప్రశంసించారు.
కథ విషయానికి వస్తే, దొరికిన ఒక లేడీస్ పర్స్ చుట్టూ తిరిగే మిస్టరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో మమ్ముట్టి మాజీ పోలీస్ అధికారి డొమినిక్ పాత్రలో కనిపిస్తాడు. పోలీస్ ఉద్యోగం నుంచి తప్పుకున్న తర్వాత అతడు ప్రైవేట్ డిటెక్టివ్‌గా మారతాడు. అతడి అసిస్టెంట్ విక్కీగా గోకుల్ సురేష్ నటించాడు. దొరికిన లేడీస్ పర్స్ ఓనర్ ఎవరో తెలుసుకునే క్రమంలో, మిస్సైన పూజ అనే అమ్మాయితో ఈ కేసుకు సంబంధం ఉందని బయటపడుతుంది. ఇంకా విచారణ కొనసాగుతుండగా పూజ బాయ్‌ఫ్రెండ్ కార్తీక్ కూడా కనిపించకుండా పోయినట్టు తెలుస్తుంది. చివరకు పూజ హత్యకు గురైన నిజం బయటపడుతుంది. ఈ దర్యాప్తులో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను మైండ్ బ్లాక్ చేసేలా ఉంటుందని చెప్పాలి. పూజను హత్య చేసింది ఎవరు, కార్తీక్‌కు ఏమైంది, అసలు ట్విస్ట్ ఏంటన్నది తెలుసుకోవాలంటే డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా చూడాల్సిందే.