జబర్దస్త్ (Jabardasth) షో ద్వారా భారీ ఫేమ్ సంపాదించుకున్న కమెడియన్లలో జబర్దస్త్ వెంకీ (Jabardasth Venky) ఒకరు. షో ప్రారంభమైన తొలినాళ్లలోనే ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన వెంకీ, క్రమంగా వెంకీ మంకీస్ టీమ్ (Venky Monkeys team) ద్వారా టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. అయితే ఇటీవల జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన వెంకీ, ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో షోకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. ముఖ్యంగా నాగబాబు (Nagababu) తనను అవమానించిన ఘటనను తొలిసారి బహిర్గతం చేశాడు.
వెంకీ మాట్లాడుతూ, మిమిక్రి ద్వారా చంద్రన్న (Chandranna) పరిచయం అయ్యిందని, ఆయనే తనను జబర్దస్త్ షోలోకి తీసుకువచ్చారని వెల్లడించాడు. మొదట చంద్రన్న టీమ్‌లో మెంబర్‌గా పనిచేసిన వెంకీ, ఆ తర్వాత రాఘవ (Raghava) టీమ్‌లో, వేణు (Venu) టీమ్‌లో కూడా చేశాడు. కొంతకాలానికి తనకు టీమ్ లీడర్ అవకాశం వచ్చినా, మొదట్లో ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహించలేకపోయానని వెంకీ ఒప్పుకున్నాడు.
ఈ క్రమంలోనే తన జీవితంలో మర్చిపోలేని ఒక అవమానకర సంఘటన జరిగిందని వెంకీ చెప్పాడు. ఒకరోజు తన స్కిట్స్ చూడటానికి వరంగల్ (Warangal) నుంచి తన ఫ్రెండ్స్ సెట్‌కు వచ్చారని తెలిపాడు. వారు సెట్‌లో ఒక పక్కన కూర్చొని తన స్కిట్‌ను చూస్తుండగా, స్కిట్ అయిపోయిన వెంటనే నాగబాబు గారు తనపై తీవ్రంగా ఫైర్ అయ్యారని వెంకీ గుర్తు చేసుకున్నాడు. “అసలు మీరు ఏం మనుషులు, ఇది స్కిట్టా?” అంటూ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌ను పిలిచి అందరి ముందే గట్టిగా తిట్టారని చెప్పాడు. ఆ సమయంలో తన ఫ్రెండ్స్ అంతా ఇది చూసి షాక్ అయ్యారని, తనకు మాత్రం తీవ్రమైన అవమానం అనిపించిందని వెంకీ భావోద్వేగంగా వివరించాడు.
ఆ సంఘటన తర్వాత డైరెక్టర్స్ తనను పిలిచి “నీది లాస్ట్ షెడ్యూల్” అని చెప్పడంతో, తీవ్రంగా ఫీల్ అయి వరంగల్ వెళ్లిపోయానని వెంకీ తెలిపాడు. అయితే కొద్దిరోజుల తర్వాత డైరెక్టర్స్ మళ్లీ కాల్ చేసి, ఇంకా కొత్త టీమ్ సెట్ అవ్వలేదని, ఒక చివరి స్కిట్ చేయమని కోపంగానే చెప్పారని వెల్లడించాడు. అదే సమయంలో “దేవుడు ఒక ఛాన్స్ ఇస్తాడు” అన్న భావన తనలో కలిగిందని వెంకీ చెప్పాడు.
అప్పటివరకు తమ టీమ్‌కు రైటర్స్ స్కిట్స్ రాసిచ్చేవారని, కానీ ఈసారి తానే స్కిట్ రాసుకోవాలని నిర్ణయించుకున్నానని వెంకీ వెల్లడించాడు. హనుమాన్ జంక్షన్ (Hanuman Junction), గుండె జారి గల్లంతయిందే (Gunde Jaari Gallanthayyinde) సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చూసి, అందులోని మిస్ గైడ్ కామెడీ నుంచి రెండు లైన్స్ తీసుకుని స్కిట్ డిజైన్ చేశానని తెలిపాడు. డైరెక్టర్స్ ముందు ట్రై చేస్తే బాగుందని చెప్పారని, స్టేజీ మీదకి వెళ్లే సమయంలో నాగబాబు గారు “మళ్లీ వీడ్నే పెట్టారా?” అని అడిగిన విషయాన్ని కూడా వెంకీ గుర్తు చేసుకున్నాడు.
స్కిట్ మొదలైన తర్వాత నాగబాబు గారు ఫుల్‌గా నవ్వారని, స్కిట్ అయిపోయాక “గుడ్” అని చెప్పడంతో పాటు రోజా (Roja) మేడం కూడా అభినందించారని వెంకీ ఆనందంగా చెప్పాడు. అదే రోజు మరో ఎపిసోడ్ షూటింగ్‌లో, తన ఇంట్లో జరిగిన ఓ సంఘటనను ఆధారంగా చేసుకుని గిఫ్ట్ కాన్సెప్ట్‌తో కన్ఫ్యూజన్ కామెడీ స్కిట్ రాసుకున్నానని వెల్లడించాడు. ఆ స్కిట్ తన రాతనే కాదు, తన జీవితాన్నే మార్చేసిందని వెంకీ స్పష్టం చేశాడు.
జీవన్ (Jeevan)తో కలిసి చేసిన ఆ స్కిట్‌కు సెట్ మొత్తం విజిల్స్, అరుపులతో మార్మోగిపోయిందని వెంకీ చెప్పాడు. నాగబాబు గారు కూడా ఆ స్కిట్ చూసి ఫుల్‌గా నవ్వి, చివరికి పిలిచి హగ్ చేసుకున్నారని తెలిపాడు. ఆ రోజు నుంచే కన్ఫ్యూజన్ కామెడీతో తనకు వరుస సక్సెస్‌లు వచ్చాయని, అప్పటి అవమానమే తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయిందని జబర్దస్త్ వెంకీ (Jabardasth Venky) భావోద్వేగంగా వెల్లడించాడు.