తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆటపై చిన్ననాటి నుంచే మక్కువ పెంచుకున్న ఆ కుర్రాడు క్రీజులోకి వచ్చాడంటే ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తాల్సిందే. ఏడేండ్ల వయసు నుంచే క్రికెట్ (Cricket) పై ఆసక్తితో ఆటలో ఏండ్ల తరబడి కఠోర శ్రమ, మొక్కవోని దీక్షతో ఎదిగిన ఆ యువ సంచలనం.. హైదరాబాద్ జట్టుకు అండర్ 14 స్థాయి నుంచే ప్రాతినిథ్యం వహిస్తూ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెటర్లు పోటీపడే ఐపీఎల్ (IPL) వేదికపై మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు. రెండు రోజుల క్రితం అబుదాబిలో ముగిసిన ఐపీఎల్ మినీ వేలం (IPL Mini Auction) లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) దక్కించుకున్న కరీంనగర్ కుర్రాడు పేరాల అమన్ రావు (Perala Aman Rao). భవిష్యత్‌లో భారత క్రికెట్ జట్టు (Team India) కు ఆడటమే తన లక్ష్యమని స్పష్టం చేస్తున్నాడు.
బీసీసీఐ (BCCI) నిర్వహించే టీ20 టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy) లో హైదరాబాద్ (Hyderabad Cricket Team) తరఫున ఆడుతూ సంచలన ప్రదర్శనలతో సత్తాచాటిన అమన్ రావును ఐపీఎల్ మినీ వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 30 లక్షల కనీస ధరతో దక్కించుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్న 21 ఏండ్ల అమన్ రావు.. కరీంనగర్ నుంచి ఐపీఎల్ వరకూ సాగిన తన ప్రయాణంలోని విశేషాలను పంచుకుంటూ ఎంతో ఆత్మవిశ్వాసంగా మాట్లాడుతున్నాడు.
ఏడేండ్ల ప్రాయం నుంచే ప్రయాణం
ఏడేండ్ల వయసులోనే బ్యాట్ పట్టిన అమన్.. అండర్ 11, అండర్ 14, అండర్ 15, అండర్ 16, అండర్ 19 విభాగాల్లో నిలకడగా రాణిస్తూ ఒక్కో మెట్టు ఎక్కాడు. ప్రస్తుతం హైదరాబాద్ అండర్ 23 జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2018లో బీసీసీఐ నిర్వహించిన విజయ్ మర్చంట్ ట్రోఫీ (Vijay Merchant Trophy) లో హైదరాబాద్ అండర్ 16 తరఫున కేరళపై 238 నాటౌట్ పరుగులు చేయడంతో అమన్ ప్రతిభ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ ప్రదర్శనతో అతడి సత్తాను గమనించిన హెచ్‌సీఏ (HCA) 2019లో అండర్ 16 జట్టుకు అమన్‌ను కెప్టెన్‌గా నియమించింది.
అదే క్రమంలో కూచ్‌బెహార్ ట్రోఫీ (Cooch Behar Trophy), వినూ మన్కడ్ ట్రోఫీ (Vinoo Mankad Trophy) లలో హైదరాబాద్ అండర్ 19 జట్టుకు ఆడాడు. 2022–23 సీజన్‌లో కూచ్‌బెహార్ ట్రోఫీలో కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే 409 పరుగులు చేసి మూడు శతకాలు సాధించాడు. 2023–24 సీజన్‌లో సీకే నాయుడు ట్రోఫీ (CK Nayudu Trophy) లో హైదరాబాద్ తరఫున 79 సగటుతో 709 పరుగులు చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఆ సీజన్‌లో హైదరాబాద్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.
దూకుడే అతడి అసలైన బలం
టీ20 ఫార్మాట్ (T20 Format) లో ఆరంభం నుంచే వేగంగా ఆడాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫార్మాట్ అమన్‌కు పూర్తిగా నప్పుతుంది. కెరీర్ ఆరంభం నుంచే ఓపెనర్‌గా రాణిస్తున్న అమన్ మొదటి బంతి నుంచే బౌలర్లపై ఒత్తిడి పెడతాడు. టీ20ల్లో అతడి స్ట్రైక్ రేట్ (Strike Rate) 162గా ఉండటం అతడి దూకుడుకు నిదర్శనం. తాజాగా స్మాట్ టోర్నీ (SMAT) లోనూ మెరుపులు మెరిపించి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ దృష్టిని ఆకర్షించాడు.
నాన్నే ప్రేరణ
అమన్ స్వస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి. ప్రస్తుతం అతడి కుటుంబం హైదరాబాద్‌లో నివసిస్తోంది. అమన్ తండ్రి పేరాల మధుసూదన్ రావు (Perala Madhusudan Rao) కూడా క్రికెటరే. కరీంనగర్ హిందూ క్రికెట్ జట్టు తరఫున జిల్లా స్థాయి క్రికెట్ ఆడారు. నాన్నే అమన్‌కు తొలి గురువు, అతని జీవితంలో ప్రధాన స్ఫూర్తి. చిన్నప్పట్నుంచే అమన్ ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు అతడిని పూర్తిగా ప్రోత్సహించారు. చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయని అమన్ ప్రస్తుతం ఎంబీఏ (MBA) చదువుతున్నాడు.
టీమ్ ఇండియానే నా లక్ష్యం
ఐపీఎల్‌లో అవకాశం దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందని అమన్ రావు చెబుతున్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆటను మార్చుకోవడమే తన బలమని, ఐపీఎల్ తనను తాను నిరూపించుకునేందుకు అద్భుతమైన వేదిక అని అభిప్రాయపడుతున్నాడు. భవిష్యత్‌లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాలన్నదే తన కల అని స్పష్టంగా చెబుతున్నాడు.