ఇప్పటివరకు అమల్లో ఉన్న ఫాస్టాగ్ (FASTag) సిస్టమ్ ద్వారా టోల్ గేట్ల వద్ద కొంతవరకు సౌలభ్యం కలిగినప్పటికీ, పూర్తిగా ఆగకుండా వెళ్లే పరిస్థితి లేదు. ముఖ్యంగా పండుగలు, సెలవులు లేదా పీక్ అవర్స్ సమయంలో టోల్ ప్లాజాల వద్ద భారీ రద్దీ ఏర్పడుతుంది. ఈ సమయంలో ఫాస్టాగ్ క్యూలైన్లలో గంటల తరబడి వాహనదారులు వేచి ఉండాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా కొత్త టోల్ వ్యవస్థ (New Toll System) అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ఇకపై టోల్ గేట్ల దగ్గర ఒక్క నిమిషం కూడా ఆగాల్సిన అవసరం ఉండదు.
ఈ కొత్త విధానం వాహనదారులకు నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక మీరు హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు టోల్ గేట్ల వద్ద బ్రేక్ వేయాల్సిన అవసరం లేకుండా రయ్ రయ్ అంటూ నాన్ స్టాప్‌గా దూసుకెళ్లవచ్చు. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ సిస్టమ్ ద్వారా నగదు అవసరం లేకుండా డైరెక్ట్‌గా టోల్ ఫీజు కట్ అవుతోంది. దీనివల్ల టోల్ గేట్ వద్ద వేచిచూసే సమయం కొంత మేర తగ్గింది. అయినా, వాహనాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఫాస్టాగ్ స్కానింగ్ ప్రక్రియ కూడా ఆలస్యం అవుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే ఇప్పుడు మరింత ఆధునికమైన టోల్ కలెక్షన్ విధానం తీసుకొస్తున్నారు.
టోల్ గేట్లు లేకుండానే టోల్ వసూలు
కొత్తగా ప్రవేశపెట్టబోయే ఈ విధానం పేరు మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోల్ కలెక్షన్ సిస్టమ్ (Multi Lane Free Flow Toll Collection System). ఇది ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (Automatic Number Plate Recognition – ANPR) టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఈ సిస్టమ్ అమల్లోకి వస్తే సంప్రదాయ టోల్ గేట్లు పూర్తిగా తొలగించబడతాయి. రోడ్లపై కొన్ని కీలక ప్రాంతాల్లో కెమెరాలతో కూడిన ప్రత్యేక స్ట్రక్చర్లు ఏర్పాటు చేస్తారు. వాహనం అక్కడి నుంచి వెళ్లగానే, ఆ కెమెరాలు నెంబర్ ప్లేట్‌ను స్కాన్ చేసి ఆటోమేటిక్‌గా టోల్ ఫీజును కట్ చేస్తాయి.
దీని వల్ల వాహనదారులు ఎక్కడా ఆగాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 11 టోల్ ప్లాజాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. అక్కడ మంచి ఫలితాలు రావడంతో, త్వరలో దేశవ్యాప్తంగా దీనిని విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే హైవే ప్రయాణం మరింత సులభంగా మారనుంది.
కొత్త వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
ఈ ఆటోమేటిక్ టోల్ పేమెంట్ విధానాన్ని అమలు చేసే కాంట్రాక్ట్‌ను జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (Jio Payments Bank Limited) దక్కించుకుంది. ఈ మేరకు ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (Indian Highways Management Company Limited – IHMCL)తో ఒప్పందం కుదిరింది. ఈ కొత్త టోల్ వ్యవస్థలో డెడికేటెడ్ షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ (Dedicated Short Range Communication – DSRC), రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (Radio Frequency Identification – RFID), అలాగే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (Global Navigation Satellite System – GNSS) వంటి ఆధునిక టెక్నాలజీలను కలిపి ఉపయోగిస్తారు.
ఈ టెక్నాలజీల సహాయంతో వాహనం ఎంత దూరం ప్రయాణించింది, ఏ హైవే సెక్షన్‌ను ఉపయోగించింది అన్నదాన్ని గుర్తించి, దానికి అనుగుణంగా టోల్ ఫీజు ఆటోమేటిక్‌గా లెక్కించి కట్ చేస్తారు. మానవ జోక్యం లేకుండానే ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. దీంతో పొరపాట్లకు ఆస్కారం కూడా తక్కువగా ఉంటుంది.
వాహనదారులకు ఎంత లాభం?
ఈ కొత్త టోల్ వ్యవస్థ అమల్లోకి వస్తే వాహనదారులకు సమయం, ఇంధనం రెండూ ఆదా అవుతాయి. టోల్ గేట్ల వద్ద ఆగి మళ్లీ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేకపోవడం వల్ల ఫ్యూయల్ సేవింగ్ కూడా జరుగుతుంది. అలాగే రద్దీ తగ్గడంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా లాంగ్ డ్రైవ్స్ చేసే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా మారనుంది. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ కొత్త టోల్ సిస్టమ్ అమల్లోకి వస్తే, హైవే ప్రయాణం పూర్తిగా కొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు.
🚨India rolls out multi-lane free flow tolling syste. pic.twitter.com/YsAH8xTHf8
— Indian Infra Report (@Indianinfoguide) October 13, 2025