ఈ ఏడాది ముగింపు సినీ అభిమానులకు నిజంగానే పూనకాలు రప్పించేలా మారబోతోంది. థియేటర్లు మొత్తం బ్లాస్ట్ అవుతాయా అంటే అవుననే చెప్పాలి. కారణం రీ రిలీజ్ ట్రెండ్‌లో కింగ్స్‌గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), మహేష్ బాబు (Superstar Mahesh Babu) తమ కెరీర్‌లో కీలకమైన సూపర్ హిట్ సినిమాలతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తలపడబోతుండడమే. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన జల్సా (Jalsa Movie), అదే విధంగా మహేష్ బాబును స్టార్ హీరోగా నిలబెట్టిన మురారి (Murari Movie) డిసెంబర్ 31న రీ రిలీజ్ కానున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా నిర్వాహకులు విడుదల చేశారు.
ఇప్పటికే ఈ రెండు సినిమాలు గతంలో రీ రిలీజ్ అయి సెన్సేషనల్ రికార్డ్స్‌ను క్రియేట్ చేశాయి. 2022లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా సినిమాకు ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ షోలు ప్లాన్ చేయగా, దాదాపు 3 కోట్ల 20 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అప్పట్లో ఇది ఆల్ టైం ఇండియన్ రీ రిలీజ్ రికార్డ్‌గా నిలిచింది. ఈ విజయం రీ రిలీజ్ ట్రెండ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.
అదే బాటలో గత ఏడాది మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి సినిమాను గ్రాండ్‌గా రీ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. మొదటి రోజే 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన మురారి, ఫుల్ రన్‌లో దాదాపు 10 కోట్ల రూపాయల గ్రాస్‌ను నమోదు చేసింది. దీంతో ఈ సినిమా కూడా రీ రిలీజ్ హిస్టరీలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ రెండు సినిమాలు ఇప్పటికే ఆల్ టైం రికార్డ్స్ క్రియేట్ చేయడంతో, మరోసారి రీ రిలీజ్ అవుతుండడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
ఇప్పుడు సోషల్ మీడియాలో అసలు యుద్ధమే మొదలైంది. చూసుకుందాం మీ హీరోనా, మా హీరోనా, రీ రిలీజ్ ట్రెండ్ కింగ్ ఎవరో ఈసారి తేలిపోతుంది అంటూ పవన్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. హైదరాబాద్‌లోని సంధ్య 70 ఎంఎం (Sandhya 70MM)లో జల్సా, సంధ్య 35 ఎంఎం (Sandhya 35MM)లో మురారి ప్రదర్శితమైతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడమే కష్టం. అలాగే సుదర్శన్ 35 ఎంఎం (Sudharshan 35MM), దేవి 70 ఎంఎం (Devi 70MM) లాంటి థియేటర్లలో ఈ సినిమాలు వస్తే అభిమానుల హడావిడి ఏ స్థాయిలో ఉంటుందో చెప్పలేం. వచ్చే వారం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, డిసెంబర్ 31 రీ రిలీజ్ వార్ ఎలా ముగుస్తుందో చూడాలి.