రోషన్ (Roshan), అనస్వర రాజన్ (Anaswara Rajan) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఛాంపియన్ (Champion) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రదీప్ అద్వైత్ (Pradeep Advaith) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్వప్న సినిమాస్ (Swapna Cinemas), జీ స్టూడియోస్ (Zee Studios), ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ (Anandi Arts Creations) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యూత్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ మూవీ నుంచి విడుదలైన గిరగిర, సల్లంగుండాలే పాటలు సోషల్ మీడియాలో చార్ట్‌బస్టర్స్‌గా నిలిచి సినిమాపై హైప్‌ను పెంచాయి.
ఇక నందమూరి కళ్యాణ్ చక్రవర్తి (Nandamuri Kalyan Chakravarthy), అర్చన (Archana) కీలక పాత్రల్లో నటించడంతో సినిమాకు మరింత బలం చేకూరింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
స్టేజ్‌పై మాట్లాడిన రామ్ చరణ్, యంగ్ హీరో రోషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “రోషన్ చిన్నప్పటి నుంచే నాకు బాగా తెలుసు. కానీ ఛాంపియన్ మూవీ పోస్టర్‌లో అతన్ని చూసినప్పుడు హాలీవుడ్ హీరోలా, యూరోపియన్ మోడల్‌లా కనిపించాడు” అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ వ్యాఖ్యలు వినగానే ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మారుమోగింది. రోషన్ లుక్, ప్రెజెన్స్ తనను నిజంగా ఆశ్చర్యపరిచాయని చరణ్ అన్నారు.
అంతేకాదు, హీరో శ్రీకాంత్ (Hero Srikanth)ను ఉద్దేశిస్తూ సరదాగా మాట్లాడుతూ, “ఇందాకే శ్రీకాంత్ అన్నయ్యను అడిగాను… నువ్వు రౌండ్‌గా ఉంటావు, రోషన్ మాత్రం షార్ప్‌గా ఎలా అయ్యాడు అని” అంటూ నవ్వులు పూయించారు. చివరగా శ్రీకాంత్, ఆయన సతీమణి మంచి మనసుకు ఇది నిదర్శనమని, ఛాంపియన్ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని రామ్ చరణ్ తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారి, రోషన్‌కు మరింత క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి.