బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty)కి కష్టాలు ఇంకా కొనసాగుతున్నట్లే కనిపిస్తున్నాయి. ఇప్పటికే బెంగళూరులో ఆమెకు చెందిన ప్రముఖ రెస్టారెంట్ బాస్టియన్ (Bastian Restaurant)పై కేసు నమోదైన విషయం తెలిసిందే. అనుమతించిన సమయాన్ని మించి కార్యకలాపాలు నిర్వహించడం, అర్ధరాత్రి పార్టీలకు అనుమతించి నిబంధనలు ఉల్లంఘించడమే కారణంగా బెంగళూరు పోలీసులు (Bengaluru Police) ఈ రెస్టారెంట్‌పై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. ఈ వ్యవహారం ఇంకా చల్లారకముందే తాజాగా మరో వివాదం శిల్పా శెట్టిని చుట్టుముట్టింది.
తాజా సమాచారం ప్రకారం, ముంబయిలోని శిల్పా శెట్టికి చెందిన రెస్టారెంట్‌పై ఆదాయపు పన్నుశాఖ (Income Tax Department) అధికారులు దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణలపై పలు కంపెనీలపై ఐటీ అధికారులు సోదాలు చేపట్టగా, అందులో శిల్పా శెట్టి హోటల్ కూడా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. బుధవారం నుంచి ముంబయి, పరిసర ప్రాంతాల్లో సుమారు 20 నుంచి 24 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో శిల్పా శెట్టికి సంబంధించిన ఒక రెస్టారెంట్‌తో పాటు మరికొన్ని కార్యాలయాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. బాస్టియన్ రెస్టారెంట్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, పన్ను అవకతవకలపై కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.
అయితే తన ఇంటిపై ఐటీ దాడులు జరిగాయన్న వార్తలను శిల్పా శెట్టి ఖండించారు. మహారాష్ట్ర పోలీసులు (Maharashtra Police) శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా (Raj Kundra)పై మోసం ఆరోపణలతో నమోదు చేసిన కేసుతో గానీ, బెంగళూరులో బాస్టియన్ రెస్టారెంట్‌పై నమోదైన కేసుతో గానీ, ఈ ఐటీ సోదాలకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. బెంగళూరులోని బాస్టియన్ రెస్టారెంట్‌కు శిల్పా శెట్టి కో ఓనర్‌గా ఉన్నారని, రెస్టారెంట్‌లో ఆమెకు యాజమాన్య హక్కులు ఉన్నాయని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై రూ.60 కోట్ల మోసం ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ అంశంపై ఇటీవల శిల్పా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, తాను విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. ఈ కేసులో తన పేరును కావాలనే ఇరికించారని, కంపెనీ కార్యకలాపాలతో తనకు ప్రత్యక్ష సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు, 2019లో శిల్పా శెట్టి బాస్టియన్ హాస్పిటాలిటీ (Bastian Hospitality)లో 50 శాతం వాటాను కొనుగోలు చేశారు. వ్యాపారవేత్త రంజీత్ బింద్రా (Ranjit Bindra) యాజమాన్యంలో ఉన్న ఈ సంస్థ ముంబయి, గోవా, బెంగళూరు సహా పలు నగరాల్లో రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. వివాదాల మధ్యే శిల్పా శెట్టి త్వరలో ‘అమ్మకై’ (Ammakai Restaurant) పేరుతో మరో కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.