మనసు ముక్కలయ్యే సంఘటన ఇది… రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం యావత్ తెలంగాణను కుదిపేసింది. తాండూరు పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన దంపతులు ఎల్లయ్య గౌడ్ – అంబిక ముగ్గురు ఆడబిడ్డలను ఒకే రోజు కోల్పోయారు. ఈ విషాదం తల్లిదండ్రుల గుండెల్లో ముద్రవేసిన శాశ్వత గాయం.
ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు — తనూష, సాయిప్రియ, నందిని.
వీరిలో తనూష ఎంబీఏ చదువుతోంది, సాయిప్రియ కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్, నందిని అదే కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. బంధువుల వివాహానికి హాజరై, తిరిగి కాలేజీకి బయలుదేరిన వీరు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఒక్క క్షణంలోనే ఆ కుటుంబం చీకట్లో మునిగిపోయింది.
తల్లి అంబిక ఆస్పత్రి ముందు కూతుళ్ల పేర్లు పిలుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుండగా, అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. “నా అమ్మాయిలు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు” అని కలలు కనిన తల్లిదండ్రులు క్షణాల్లో శూన్యమయ్యారు. వారి కన్నీరు చూసిన ప్రతి ఒక్కరూ తల్లితండ్రుల బాధను అనుభవించారు.
గ్రామమంతా సంతాపంలో మునిగిపోయింది. స్నేహితులు, బంధువులు, విద్యార్థులు అంత్యక్రియల్లో పాల్గొని కన్నీరు మున్నీరు అయ్యారు. ముగ్గురు కూతుళ్లు ఒక్కసారే కాటికి పయనమైన దృశ్యం అందరినీ హృదయవిదారకంగా తాకింది.
జీవితంలో ఇంతటి బాధను తల్లిదండ్రులు అనుభవించకూడదు.
ఒకే కడుపున పుట్టి, ఒకేసారి కాటికి వెళ్ళిపోయిన ఈ ముగ్గురు బంగారు పిల్లల ఆత్మలు స్వర్గంలోనైనా ప్రశాంతంగా ఉండాలని అందరూ ప్రార్థిస్తున్నారు.
దేవుడా… ఈ కష్టం పగవాడికైనా రాకూడదు!