టాలీవుడ్ ఇండస్ట్రీ ఏళ్ల తరబడి పోరాడిన పైరసీ ముఠాలకు గట్టి చెక్ పడింది. ముఖ్యంగా తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం, అతను హ్యాండిల్ చేసిన 65 ప్రాక్సీ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, డౌన్‌లోడ్ సర్వర్‌లన్నీ ఒకేసారి షట్ చేయడంతో ఇండస్ట్రీ మొత్తం ఆనందంలో మునిగిపోయింది. ఈ అరెస్టుతో టాలీవుడ్ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ యజమానులకు భారీ ఊరట లభించింది. ఎందుకంటే ఇండస్ట్రీ నుండి వచ్చేనని భావించిన వందల కోట్ల వసూళ్లు గత కొన్నేళ్లుగా ఒక్క ఐబొమ్మ, టొరెంట్స్ కారణంగా నేలమట్టమయ్యాయి. ఇప్పుడు ఆ భారీ బీభత్సానికి మొదటిసారి నియంత్రణ లభించినట్టుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదివరకు ఇమ్మడి రవి గురించి ఎవరికి పెద్దగా సమాచారం లేదు. కానీ అరెస్టు తర్వాత అతని కార్యకలాపాలు బయటికొచ్చిన తర్వాత పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఇరవై వేల సినిమాలను ప్రత్యేక హార్డ్‌డిస్క్‌లలో నిల్వ చేసి, హై క్వాలిటీ ప్రింట్స్‌ను ప్రపంచవ్యాప్తంగా పంచి, ఒక్క పైరసీ ద్వారానే ఇరవై కోట్లకు పైగా సంపాదించాడని విచారణలో బయటపడింది. ఇక్కడితో ఆగలేదు. థియేటర్లలో విడుదలైన సినిమాలు, ఓటిటిలో అప్‌లోడ్ అయ్యే కంటెంట్ అన్నింటినీ గంటల వ్యవధిలోనే తన సైట్‌లో పెడుతున్నాడు. పైగా గతంలో పోలీసులకు సవాల్ చేస్తూ మమ్మల్ని ఆపలేరు, మా నెట్‌వర్క్ ప్రపంచవ్యాప్తంగా ఉంది అని పోస్ట్ పెట్టడం, హీరోల పేర్లు కూడా ఎక్స్‌పోజ్ చేస్తామని హెచ్చరించడం… అతని ధైర్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
ఐబొమ్మ అధికారికంగా తమ వెబ్‌సైట్‌ను క్లోజ్ చేస్తున్నామని ప్రకటించడం ఇండస్ట్రీకి పెద్ద విజయం. కానీ ఇది కథకు పూర్తిగా ముగింపు అని చెప్పలేం. పైరసీ ప్రపంచవ్యాప్తంగా మూలాలు పాతుకుపోయిన ముఠాలతో నడిచే క్రిమినల్ నెట్‌వర్క్. ఇమ్మడి రవి ఒక పెద్ద నోడ్ మాత్రమే. అతనికి పనిచేసిన హ్యాకర్ నెట్‌వర్క్, విదేశీ సర్వర్ హోస్టింగ్ సంస్థలు, టొరెంట్ సైట్లు, డార్క్ వెబ్ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికీ యాక్టీవ్ గా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు తదుపరి టార్గెట్ గా టొరెంట్ ఆధారిత పైరసీ గ్రూపులను తీసుకున్నారు. ముఖ్యంగా విడుదల రోజే ప్రింట్ బయటకు తీసే స్మగ్లర్లపై ఫోకస్ చేస్తున్నారు. దీనిని అడ్డుకోగలిగితే టాలీవుడ్ కు ఎన్నడూ లేని స్థాయి రివైవల్ వచ్చే అవకాశం ఉంది.
పైరసీ తగ్గితే మొదటగా హిట్ అయ్యేది థియేటర్ కలెక్షన్లే. ఎందుకంటే చాలా మంది ప్రేక్షకులు సినిమా థియేటర్‌లో చూడాలనుకున్నా, అదే సాయంత్రం పైరసీ ప్రింట్ వచ్చేస్తుందని తెలిసి వెనుదిరుగుతున్నారు. పైరసీ లేని పరిస్థితుల్లో ప్రేక్షకులు తిరిగి థియేటర్లకు వచ్చే అవకాశం ఎక్కువ. లేదా ఓటిటిలో వచ్చేంతవరకు వెయిట్ చేసే అలవాటు పెరుగుతుంది. దీని వల్ల నిర్మాతలకు, థియేటర్ యజమానులకు, సాంకేతిక విభాగాలకు, అన్ని వర్గాలకూ పెద్ద ఉపయోగం. టాలీవుడ్ మరోసారి 2015 నుంచి 2019 మధ్యకాలంలా కళకళలాడే అవకాశం ఉంది.
ప్రస్తుతం సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించడం కూడా ఈ విజయాన్ని ఎంత కీలకంగా భావిస్తున్నారో తెలిపే విషయం. ఇలాంటి యాక్షన్ ప్రతిసారీ జరిగితే టాలీవుడ్ ఇండస్ట్రీని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే కాకుండా, కొత్త దర్శకులు, చిన్న నిర్మాతలకు కూడా సమాన అవకాశాలు లభిస్తాయి. ఇక మిగిలింది డిజిటల్ పైరసీని పూర్తిగా నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన తదుపరి చర్యలే. దీని కోసం సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే దీర్ఘకాలిక వ్యూహాలు సిద్ధం చేస్తోంది. పైరసీ కథ ఇక్కడితో ముగుస్తుందా లేదా అనేది సమయం చెప్పాలి. కానీ ఇప్పటివరకు వచ్చిన ఫలితం మాత్రం టాలీవుడ్‌కు భారీ ఊరట ఇచ్చింది.