భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం కొత్త శిఖరాన్ని తాకింది. పండుగ ఉత్సాహం, ఈ-కామర్స్ సీజన్, మరియు పెరుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కారణంగా, అక్టోబర్ నెలలో యూపీఐ (Unified Payments Interface) లావాదేవీలు చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరాయి.
భారత జాతీయ చెల్లింపుల సంస్థ (NPCI) విడుదల చేసిన డేటా ప్రకారం, అక్టోబర్‌లో యూపీఐ ద్వారా జరిపిన మొత్తం లావాదేవీల విలువ ₹27.28 లక్షల కోట్లు,
మొత్తం లావాదేవీల సంఖ్య 20.7 బిలియన్ (అంటే 2,070 కోట్ల లావాదేవీలు) గా నమోదయ్యాయి.
ఇది గత రికార్డు అయిన మే నెలలోని ₹25.14 లక్షల కోట్లును అధిగమించింది. లావాదేవీల విలువ నెలవారీగా (MoM) 9.5%, సంవత్సరానికి (YoY) 16% వృద్ధిని చూపింది.
ప్రతీ రోజూ సగటున 668 మిలియన్ లావాదేవీలు జరగగా, వాటి రోజువారీ విలువ ₹87,993 కోట్లుగా నమోదైంది. ఇది భారతీయుల దైనందిన జీవనశైలిలో డిజిటల్ చెల్లింపులు ఎంత లోతుగా భాగమైపోయాయో సూచిస్తుంది.
యూపీఐతో పాటు రిటైల్ చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్, పండుగ సీజన్ ట్రాన్సాక్షన్లు పెరగడం కూడా ఈ వృద్ధికి కారణమైంది. చిన్న దుకాణాల నుండి పెద్ద కంపెనీల దాకా, యూపీఐ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న సాధనంగా మారింది.
డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్తూ, యూపీఐ ఇప్పుడు ప్రపంచానికి భారత ఆవిష్కరణ శక్తిని చూపిస్తోంది.