
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ధనిక నటి ఎవరు అని ఎవరినైనా అడిగితే, సాధారణంగా ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai), ప్రియాంక చోప్రా (Priyanka Chopra), దీపికా పదుకొనే (Deepika Padukone) పేర్లే ముందుగా వినిపిస్తాయి. నేటి తరం హీరోయిన్లు ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ, బ్రాండ్ అంబాసిడర్లుగా వందల కోట్ల ఆదాయం సంపాదిస్తున్నారు. అయితే ఈ స్టార్ హీరోయిన్లందరినీ వెనక్కి నెట్టి, భారతదేశంలోనే అత్యంత సంపన్న నటిగా ఒక సీనియర్ హీరోయిన్ అగ్రస్థానంలో నిలిచిందంటే చాలామందికి ఆశ్చర్యమే కలుగుతుంది.
హారూన్ రిచ్ లిస్ట్ (Hurun Rich List) ప్రకారం ఆ హీరోయిన్ ఆస్తి విలువ అక్షరాలా రూ.4,600 కోట్లు. ఇది గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా ఆస్తి కంటే, అలాగే ఐశ్వర్య రాయ్ సంపద కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గత 15 ఏళ్లుగా ఆమె వెండితెరపై కథానాయికగా ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినా కూడా అగ్ర హీరోలకంటే ఎక్కువ ఆస్తిని కలిగి ఉండి, భారత సినీ చరిత్రలోనే అత్యంత సంపన్న నటిగా రికార్డు సృష్టించింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.
ఆమె 90వ దశకంలో తన క్యూట్ చిరునవ్వుతో కుర్రకారును ఉర్రూతలూగించిన జుహీ చావ్లా (Juhi Chawla). 1984లో మిస్ ఇండియా (Miss India) కిరీటాన్ని గెలుచుకున్న జుహీ, ఆ తర్వాత బాలీవుడ్ అగ్ర కథానాయికగా ఎదిగింది. బాలీవుడ్‌తో పాటు చిరంజీవి (Chiranjeevi) వంటి స్టార్ హీరోలతో తెలుగు సినిమాల్లోనూ నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే కాలక్రమేణా సినిమాలకు దూరమైన ఆమె, తన జీవితాన్ని పూర్తిగా కొత్త దిశగా మలుచుకున్నారు.
జుహీ చావ్లా కేవలం నటి మాత్రమే కాదు, దూరదృష్టి కలిగిన వ్యాపారవేత్త కూడా. ఆమె సంపదకు ప్రధాన కారణం తెలివైన పెట్టుబడులే. షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan)తో కలిసి రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ (Red Chillies Entertainment) సంస్థను స్థాపించి భారీ లాభాలు సాధించారు. అలాగే ఐపీఎల్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)లో ఆమె, ఆమె భర్త జై మెహతా (Jay Mehta) ప్రధాన వాటాదారులు. ఈ టీమ్ విలువ నేడు వేల కోట్లకు చేరుకుంది. సినిమాల తర్వాత వ్యాపార రంగంలో సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన జుహీ చావ్లా ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం.