బండి సంజయ్ తాజా వ్యాఖ్యలపై రాజకీయ వేడి:
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వరుసగా హిందుత్వం ఆధారంగా ప్రసంగాలు చేసే బండి సంజయ్ ఈసారి కూడా అదే విషయాన్ని ముందుకు తెచ్చారు. తనకు హిందుత్వం ప్రస్తావన ఆగితే శ్వాస ఆగినట్టేనని తెలిపిన ఆయన, రాష్ట్రంలో BJP ఎదుగుదలకు హిందూ ఓటు బ్యాంక్ ఎంతో కీలకమని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు బలమైన రాజకీయ ప్రతిస్పందనకు దారి తీశాయి.
ముస్లిం, క్రైస్తవ ఓటర్ల ప్రవర్తనపై బండి సంజయ్ విమర్శ:
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏ మతానికీ, ఏ వర్గానికీ తేడా లేకుండా పథకాలు అందిస్తున్నా… ముస్లింలు BJPకి ఓటు వేయడం లేదని బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. ముస్లింల జనాభా 12 శాతం మాత్రమే ఉన్నా వారు ఒకటై ఓటు వేస్తున్నారని, అయితే 80 శాతం ఉన్న హిందువులు మాత్రం రాజకీయంగా విభజించుకుపోతున్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారి తీశాయి. ముస్లిం ఓటుకు వ్యతిరేకంగా హిందూ ఓటును ఐక్యం చేయాలనే ఉద్దేశ్యం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది.
తెలంగాణలో హిందూ ఓటు బ్యాంక్ ఎంత ప్రభావం చూపగలదు.?
తెలంగాణలో ఇప్పటివరకు మతాధారిత ఓటింగ్ పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రాంతీయత, కుల రాజకీయాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రధాన పాత్ర పోషించాయి. బండి సంజయ్ చెప్పినట్టుగా హిందువులు ఓటు బ్యాంక్‌గా మారితే, అది రాష్ట్ర రాజకీయాలకు పెద్ద మార్పుగా ఉండే అవకాశముంది. అయితే హిందూ ఓటు పూర్తిగా BJP వైపు మళ్లే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇకపై BJP పథకం హిందూ ఓటును ఏకీకరించడం అని ఆయన మాటలతో స్పష్టమవుతోంది.
ప్రతిపక్షాల ప్రతిస్పందన ఎలా ఉండవచ్చు.?
బండి సంజయ్ ప్రకటనలపై ప్రతిపక్షాలు తప్పకుండా విమర్శలు చేయనున్నాయి. కాంగ్రెస్ మరియు BRS పార్టీలు ఇప్పటికే BJPపై మత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ వస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు వారి ఆరోపణలకు మరింత బలం చేకూర్చే అవకాశముంది. మరోవైపు, BJP మాత్రం రాష్ట్రంలో హిందూ ఓటును మళ్లీ మళ్లీ టార్గెట్ చేస్తూ ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తోంది. బండి సంజయ్ వ్యాఖ్యలు కూడా అదే వ్యూహంలో భాగమని భావిస్తున్నారు.
రాష్ట్ర ఎన్నికలపై ఈ వ్యాఖ్యల ప్రభావం:
ఏ రాష్ట్రంలోనైనా మత ఓటు కీలకపాత్ర పోషించిన ఉదాహరణలు ఉన్నాయి. అయితే తెలంగాణలో అది ఎంతవరకు పండుతుందో చూడాలి. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు హిందువుల్లో రాజకీయ చైతన్యం పెంచేలా ఉంటే, BJPకి ఫలితం దక్కవచ్చు. మరోవైపు, ఈ వ్యాఖ్యలు మైనారిటీలను, ఇతర వర్గాలను BJP నుంచి దూరం చేయగలవని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల దిశగా అన్ని పార్టీలు తమ ప్రణాళికలను సిద్ధం చేస్తుండగా… బండి సంజయ్ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఏ విధమైన ప్రభావం చూపుతాయో చూడాలి.