Article Body
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే ప్రదర్శన అంతా రికార్డుల రేంజ్‌లో కొనసాగుతున్న వేళ, అందరి దృష్టిని ఆకర్షించిన పేరు చిరాగ్ పస్వాన్‌ది. కేవలం ఒకటి–రెండు సీట్ల పార్టీ అని ఎగతాళి చేయబడిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఈసారి 75% స్ట్రైక్ రేట్‌తో సంచలన విజయం సాధించడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. తండ్రి రామ్‌విలాస్ పస్వాన్ మరణం తర్వాత పార్టీలో వచ్చిన విభేదాలు, గుర్తు కోల్పోవడం, బాబాయ్‌తో తగాదాలు—ఇన్ని ఎదురుదెబ్బలు తిన్న చిరాగ్, ఈరోజు మళ్లీ బిహార్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదగడం నిజంగా గమనార్హం.
2020 బిహార్ ఎన్నికలే చిరాగ్ రాజకీయ జీవితాన్ని తలకిందులు చేసిన మొదటి ఘట్టం. అప్పుడు ఎన్డీయే కూటమిలోనే ఉన్నా, నీతీశ్ కుమార్ నాయకత్వాన్ని కరగొట్టేందుకు చిరాగ్ ప్రత్యక్షంగా పోరాడారు. జేడీయూకు వ్యతిరేకంగా 137 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టారు. అంత పెద్ద ప్రయత్నం చేసినా, ఒక్క సీటుతోనే పరిమితమయ్యారు. అయితే ఆ ఒక్క సీటే బిహార్ రాజకీయాలను మార్చే విపరీత శక్తి అయింది. చిరాగ్ పెట్టిన అభ్యర్థులు జేడీయూ ఓట్లలో గండిపెట్టడంతో, 71 సీట్లు ఉన్న జేడీయూ 43 స్థానాలకు పడిపోయింది. ఆ ఎన్నిక తర్వాత పార్టీ లోపలే భారీ చిచ్చు పుట్టి, బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ గ్రూప్ పార్టీని దాదాపు పూర్తిగా స్వాధీనం చేసుకుంది. గుర్తు కూడా కోల్పోయిన చిరాగ్ 2021లో కొత్త పేరుతో — ఎల్జేపీ (రామ్ విలాస్) — పార్టీని మరోసారి నిర్మించారు.
అక్కడినుంచే చిరాగ్ అసలైన రాజకీయ ప్రయాణం మొదలైంది. “యువ బిహారీ” అనే ట్యాగ్‌తో, తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు ప్రజలకు మెసేజ్ ఇచ్చారు. తనను దళిత యువ నాయకుడిగా బ్రాండింగ్ చేసుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేతో మళ్లీ చేతులు కలిపి పోటీ చేసిన ఐదు స్థానాలన్నింటిలోనూ విజయం సాధించడం చిరాగ్‌ను జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. భారీ విజయాలతో ఉత్సాహంతో నిండిన చిరాగ్‌కు కేవలం సీట్లు మాత్రమే కాదు — కేంద్ర మంత్రిపదవి కూడా దక్కింది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ కీలక బాధ్యతలు చేపట్టారు. అలా వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక రాజకీయ ఇమేజ్‌ను సృష్టించుకున్నారు.
తాజా బిహార్ ఎన్నికల్లో మాత్రం చిరాగ్ మరింత పెద్ద సక్సెస్ స్టోరీగా నిలిచారు. 29 స్థానాల్లో పోటీ చేసి, 22 స్థానాల్లో ఆధిక్యంలో నిలవడం—ఒక చిన్న పార్టీకి ఇది అపూర్వ ఘనత. 75% స్ట్రైక్ రేట్‌తో ఎల్జేపీ (ఆర్వీ) ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో కుదురుగా నిలబడే శక్తిగా ఎదిగింది. భాజపా, జేడీయూ కంటే తక్కువ స్థాయికి చెందినప్పటికీ, కూటమి విజయంలో నిర్ణయాత్మక పాత్ర పోషించారు. అంతేకాదు, చిరాగ్ విజయం చాలా మంది విశ్లేషకులకు ఆంధ్రప్రదేశ్ జనసేన విజయాన్ని గుర్తు చేస్తోందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ అక్కడ ఎలా కీలక శక్తిగా మారారో, బిహార్‌లో చిరాగ్ కూడా అదే రీతిలో ఎదుగుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చిరాగ్ పస్వాన్ భవిష్యత్తు గురించి అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన ఒకే సమాధానం ఇస్తారు—“2029లో మోదీగారిని మళ్లీ ప్రధానిగా చేయడమే నా లక్ష్యం.” అయితే, బిహార్‌లో మాత్రం కార్యకర్తలు, అభిమానులు ఆయనను భవిష్యత్తు ప్రధానమంత్రి అభ్యర్థిగా చూస్తున్నారని ఆయన స్వయంగా ఇంటర్వ్యూలో తెలిపారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కాపాడడమే కాకుండా, ఆ వారసత్వాన్ని మించే స్థాయికి తీసుకుని వెళ్లడం చిరాగ్ ప్రస్తుతం సాగిస్తున్న దారిలో స్పష్టంగా కనిపిస్తోంది. బాబాయ్ చేతిలో పార్టీ కోల్పోయిన యువకుడు, ఇప్పుడు బిహార్‌లో డెసైసివ్ లీడర్‌గా ఎదగడం చిరాగ్ పస్వాన్‌ను నిజంగానే “రాక్స్టార్” రాజకీయ నాయకుడిగా నిలబె
ట్టింది.

Comments