Article Body
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా రేషన్ కార్డులను జారీ చేయడం ప్రారంభించింది. అయితే ఈ కొత్త కార్డులపై కేవలం రేషన్ బియ్యం సరఫరా మాత్రమే జరుగుతుండగా, ఇతర సంక్షేమ పథకాలు వర్తించడం లేదని లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కొత్త కార్డులపై పరిమిత లాభాలు:
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీ పథకాలను ప్రకటించింది — మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద ₹10 లక్షల వరకు వైద్య సాయం, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా పథకం, గృహలక్ష్మి ద్వారా ఉచిత విద్యుత్ మరియు గ్యాస్ సబ్సిడీ, ఇళ్ల మంజూరు వంటి పథకాలు ఉన్నాయి. అయితే తాజాగా అందజేస్తున్న కొత్త రేషన్ కార్డులు కేవలం బియ్యానికే పరిమితమయ్యాయి. ఇతర పథకాల లబ్ధి అందకపోవడంతో లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు.
జిల్లా స్థాయిలో రేషన్ కార్డుల జారీ:
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 2,35,721 రేషన్ కార్డులు ఉండగా, వాటి ద్వారా 7,29,534 మంది లబ్ధి పొందుతున్నారు. తాజాగా మరో 14 వేల పైగా కొత్త కార్డులు జారీ అయ్యాయి. అర్హులైన కుటుంబాలకు మీసేవా ద్వారా దరఖాస్తులు స్వీకరించి, రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి కార్డులు అందజేస్తున్నారు. ఈ కొత్త కార్డుల ద్వారా కుటుంబ సభ్యులందరికీ ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందిస్తున్నారు.
ఇతర పథకాల సమస్య:
ప్రజాపాలన సైట్‌లో కొత్త కార్డుదారులకు గృహలక్ష్మి, ఉచిత విద్యుత్, ₹500 గ్యాస్ సబ్సిడీ వంటి పథకాలు నమోదు చేయడానికి ఆప్షన్ అందుబాటులో లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాలకెళ్లినా “సిస్టమ్ ఆప్షన్ రాలేదు” అని సమాధానం వస్తోందని వారు వాపోతున్నారు.
ప్రజల విజ్ఞప్తి:
“ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చింది కానీ ఇతర పథకాల లబ్ధి ఇవ్వడం లేదు. ఇప్పుడు కనీసం ప్రభుత్వం స్పందించి, గృహలక్ష్మి, గ్యాస్ సబ్సిడీ, విద్యుత్ సబ్సిడీ పథకాలను అందేలా చర్యలు తీసుకోవాలి” అని లబ్ధిదారులు కోరుతున్నారు.

Comments