Article Body
తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన అక్కినేని నాగార్జున సూపర్ హిట్ చిత్రం శివ, మళ్లీ ఆధునిక టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1989లో విడుదలైన ఈ బ్లాక్ బస్టర్ ఇప్పుడు 4K, డాల్బీ అట్మాస్ ఫార్మాట్‌లో నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రీ–రిలీజ్ అయ్యింది. సినిమా విడుదలైన రోజే థియేటర్ల వద్ద భారీ హంగామా నెలకొంది. యూత్ నుంచి రెట్రో ఆడియన్స్ వరకు అందరూ థియేటర్లకు వెల్లువెత్తారు. 36 ఏళ్ల తర్వాత కూడా శివ సినిమాకున్న కల్ట్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదని తొలి రోజు వసూళ్లు స్పష్టంగా చెబుతున్నాయి.
1989లో నిర్మించబడిన ఈ చిత్రానికి అప్పట్లో పెద్ద అంచనాలు లేవు. కేవలం 75 లక్షల రూపాయల బడ్జెట్‌తో నిర్మాతలు వెంకట్ అక్కినేని, యార్లగడ్డ సురేంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. కానీ సినిమాకి వచ్చిన స్పందన అంచనాలకు మించి వుండటం వల్ల 'శివ' వసూళ్ల పరంగా భారతదేశంలో సంచలనం సృష్టించింది. నైజాంలో ఈ చిత్రం 1 కోటి రూపాయలు, ఆంధ్రలో 3 కోట్ల వరకు వసూలు చేసి మొత్తం 4 కోట్ల వసూళ్లు తెచ్చుకుంది. తమిళం, హిందీ మరియు ఇతర భాషల్లో కలిపి ఈ చిత్రం 1989–1990 మధ్య 10 కోట్లు దాటిన వసూళ్లతో ఓ రికార్డు హిట్‌గా నిలిచింది. రామ్ గోపాల్ వర్మ స్టైల్, ఇళయరాజా సంగీతం, ఎస్. గోపాల్ రెడ్డి కెమెరా వర్క్ సినిమాకు ప్రత్యేక హైలైట్ అయ్యాయి.
ఈసారి రీ–రిలీజ్ కోసం ప్రత్యేకంగా 4K రీ–మాస్టర్ చేసేందుకు, సౌండ్ డిజైన్‌ను పూర్తిగా రీ–క్రియేట్ చేయడానికి భారీ కసరత్తు జరిగింది. నిర్మాతల సమాచారం ప్రకారం, ఈ కొత్త 4K వెర్షన్ కోసం సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. డీఐ వర్క్, అట్మాస్ సౌండ్, ఫ్రేమ్ రీటచింగ్ – అన్నింటినీ పర్‌ఫెక్ట్‌గా చేయడంతో సినిమాకు పూర్తిగా కొత్త అనుభవం వచ్చిందని తొలి షోస్ చూసిన ఆడియన్స్ స్పందించారు. ప్రీమియర్ షోస్ నుంచే హౌస్‌ఫుల్ కలెక్షన్లు రావడంతో “శివ”కి మళ్లీ అదే క్రేజ్ ఉన్నట్టు నిరూపితమైంది.
తొలి రోజు వసూళ్ల విషయానికి వస్తే — తెలుగురాష్ట్రాల్లో సినిమా అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెళ్లింది. హైదరాబాద్ RTC క్రాస్ రోడ్‌లోని దేవీ థియేటర్‌లో ఒక్కరోజే 10 లక్షల రూపాయల వసూళ్లు, సుదర్శన్ 35MMలో 12.5 లక్షలు రాబట్టడం రికార్డ్ స్థాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ సహా అన్ని ప్రధాన నగరాల్లో మొదటి రోజు హౌస్‌ఫుల్ షోలు నమోదయ్యాయి. కేవలం నాస్టాల్జియా కారణమే కాకుండా, సినిమాకు చేసిన టెక్నికల్ అప్‌గ్రేడ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాత శివను చూసిన పెద్దవాళ్లతో పాటు యువతరమే ఎక్కువగా థియేటర్లకు చేరుకోవడం గమనార్హం.
ఓవర్సీస్‌లో కూడా "శివ 4K" రీ–రిలీజ్‌కు మంచి ఆదరణ లభించింది. నార్త్ అమెరికా ప్రాంతంలో గురువారం జరిగిన ప్రీమియర్ షోల నుండే 4,000 డాలర్లు (సుమారు ₹3.5 లక్షలు) వసూలు చేసింది. శుక్రవారం నాటికి ఈ సంఖ్య 25 లక్షల రూపాయలు దాటింది. రీ–రిలీజైన ఇతర తెలుగు క్లాసిక్ మూవీస్‌తో పోలిస్తే “శివ 4K”కి వచ్చిన విదేశీ రెస్పాన్స్ చాలా బలంగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన డేటా ప్రకారం—"శివ 4K" రీ–రిలీజ్ ఓపెనింగ్స్ భలే పాజిటివ్‌గా ఉండటమే కాదు, రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరోస్థాయిలో ఉండే అవకాశముంది.

Comments