Article Body
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ రికార్డులు సృష్టించి కాలక్రమంలో మరుగున పడతాయి. కానీ మరికొన్ని సినిమాలు మాత్రం కాలాన్ని దాటి ఒక కళాఖండంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన దృశ్య కావ్యమే బాజీరావు మస్తానీ (Bajirao Mastani). ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) కలల ప్రాజెక్టుగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై ఇప్పుడు పదేళ్లు పూర్తవుతోంది. మరాఠా పీష్వా బాజీరావు బల్లాడ్ మరియు ఆయన రెండవ భార్య మస్తానీ మధ్య సాగిన అపురూప ప్రేమకథను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా ఇది.
ఈ సినిమా వెనుక దాదాపు పన్నెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఉంది. 2003లోనే ఈ కథను తెరకెక్కించాలని భావించిన సంజయ్ లీలా భన్సాలీ, సరైన నటీనటుల కోసం చాలాకాలం ఎదురు చూశారు. చివరకు రణవీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకొనే (Deepika Padukone), ప్రియాంకా చోప్రా (Priyanka Chopra)లను ఎంపిక చేయడంతో ఈ ప్రాజెక్ట్‌కు ప్రాణం పోసినట్లైంది. థియేటర్లలో విడుదలైన వెంటనే ఈ సినిమా సృష్టించిన ప్రభావం అసాధారణం. భారీ సెట్లు, వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో రూపొందించిన యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను నేరుగా 18వ శతాబ్దంలోకి తీసుకెళ్లాయి.
బాజీరావుగా రణవీర్ సింగ్ చూపిన పౌరుషం, మరాఠీ యాస, డైలాగ్ డెలివరీ ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి. మస్తానీగా దీపికా పదుకొనే అందంతో పాటు వీరనారిగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రేమ, త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈ పాత్ర ఆమె కెరీర్‌లోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. కాశీబాయిగా ప్రియాంకా చోప్రా చూపించిన హుందాతనం, భావోద్వేగాలు కథకు మరింత బలాన్ని చేకూర్చాయి.
సంగీతం, ఛాయాగ్రహణం, విజువల్ గ్రాండియర్ పరంగా బాజీరావు మస్తానీ ఒక ప్రమాణంగా నిలిచింది. ‘దీవాని మస్తానీ’, ‘మల్హరి’, ‘పింగా’ వంటి పాటలు నేటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాలు వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న ఈ రోజుల్లో కూడా, బాజీరావు మస్తానీలోని ఆత్మ, కళాత్మకత ప్రత్యేకంగా నిలుస్తాయి. పదేళ్లు గడిచినా ఈ ప్రేమ కావ్యం వెండితెరపై ఇంకా సజీవంగానే ఉందని చెప్పడంలో సందేహం లేదు.

Comments