Article Body
పొరుగుదేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల చోటుచేసుకున్న బంగ్లాదేశ్ అల్లర్లు (Bangladesh Protests) దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. కాల్పుల్లో గాయపడిన బంగ్లాదేశ్‌కు చెందిన సాంస్కృతిక సంస్థ ఇంక్విలాబ్ మంచ్ (Inquilab Mancha) ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ బిన్ హదీ (Osman Hadi) మృతి చెందడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనను నిరసనకారులు తీవ్రంగా ఖండిస్తూ పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడ్డారు.
ఢాకా (Dhaka)తో పాటు పలు ప్రధాన నగరాల్లో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, మీడియా సంస్థలపై దాడులు జరిపి ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా భారత్ (India), అవామీ లీగ్ పార్టీ (Awami League Party)కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి అదుపు తప్పడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అయినప్పటికీ ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా తగ్గలేదని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న భారతీయులు (Indian Nationals), భారత విద్యార్థుల భద్రతపై దృష్టి సారించింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్ (Indian High Commission in Bangladesh) కీలక అడ్వైజరీని జారీ చేసింది. అనవసర ప్రయాణాలు చేయవద్దని, అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రాకుండా ఉండాలని సూచించింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది.
అలాగే ఏదైనా అత్యవసర సహాయం అవసరమైతే హైకమిషన్ లేదా అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాలను సంప్రదించాలని భారత హైకమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా (Social Media) వేదికగా అధికారిక పోస్టును కూడా విడుదల చేసింది. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచించింది. తాజా పరిణామాలతో దక్షిణాసియా రాజకీయ వాతావరణం మరింత సున్నితంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Comments