Article Body
క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch) అనే పదం సినీరంగంలో తరచూ వినిపిస్తూనే ఉంటుంది. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించే ప్రారంభ దశలో ఎంతో మంది మహిళలు, హీరోయిన్లు తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నట్లు ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయంలో ఎదురయ్యే ఈ చేదు అనుభవాలు అనేకమందిని మానసికంగా కుంగదీస్తున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి సినీ పరిశ్రమలోని చీకటి కోణాన్ని బయటపెట్టాయి.
ఈసారి క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినని చెప్పింది బాలీవుడ్ నటి మాల్టీ చాహర్ (Malti Chahar). ఆమె టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ (Deepak Chahar) సోదరిగా కూడా అందరికీ తెలుసు. ఇటీవల హిందీ బిగ్ బాస్ సీజన్ 19 (Bigg Boss 19)లో పాల్గొన్న మాల్టీ, తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన అనుభవాన్ని వెల్లడించింది. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌కు గురయ్యానని, ఆ సంఘటన తన జీవితాన్ని చాలా ప్రభావితం చేసిందని ఆమె చెప్పింది.
మాల్టీ చాహర్ తెలిపిన వివరాల ప్రకారం, ఓ దక్షిణాది దర్శకుడు (South Indian Director) సినిమా అవకాశం పేరుతో తనను హోటల్ గదికి రావాలని కోరాడట. ఒక ఆఫీస్ మీటింగ్ అనంతరం సాధారణంగా హగ్ చేయాలనే ఉద్దేశంతో దగ్గరకు వెళ్లిన తనపై అతడు అసభ్యంగా ప్రవర్తించాడని వెల్లడించింది. తండ్రిలా భావించిన వ్యక్తి నుంచి ఇలాంటి ప్రవర్తనను అస్సలు ఊహించలేదని, ఆ క్షణంలో తీవ్ర అసౌకర్యానికి గురయ్యానని ఆమె చెప్పింది. వెంటనే అతడిని అడ్డుకుని, అతడితో అన్ని సంబంధాలను తెంచుకున్నానని స్పష్టం చేసింది.
ఆ సంఘటన తనకు ఒక ముఖ్యమైన గుణపాఠం నేర్పిందని మాల్టీ చాహర్ పేర్కొంది. ఎవరినీ అవసరానికి మించి ఉన్నత స్థానం ఉంచవద్దని, మహిళలు అవకాశాల కోసం ఇలాంటి వాటికి అంగీకరించకూడదని ఆమె సూచించింది. మనపై మనకు నియంత్రణ ఉండటం చాలా ముఖ్యమని, ధైర్యంగా తప్పును తప్పుగా చెప్పగలగాలని ఆమె అభిప్రాయపడింది. కెరీర్ విషయానికి వస్తే, మాల్టీ చాహర్ 2018లో దర్శకుడు అనిల్ శర్మ (Anil Sharma) తెరకెక్కించిన జీనియస్ (Genius Movie) చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 2022లో ఇష్క్ పాష్మినా (Ishq Pashmina) సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ప్రస్తుతం పలు వాణిజ్య ప్రకటనలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.

Comments