Article Body
టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా (Roshan Meka), అనస్వర రాజన్ (Anaswara Rajan) జంటగా నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్ (Champion) నుంచి మరో పెద్ద సర్‌ప్రైజ్ బయటకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, క్యారెక్టర్ లుక్స్, పాటలకు మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలను మరింత పెంచుతూ తాజాగా మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ కావడం సినిమాకు అదనపు బజ్‌ను తీసుకొచ్చింది.
ట్రైలర్‌ను గమనిస్తే, బ్రిటీష్ పాలన తర్వాత నిజాం పాలన కొనసాగుతున్న హైదరాబాద్ నేపథ్యాన్ని చాలా బలంగా చూపించారు. ఫుట్‌బాల్ ప్లేయర్ మైఖేల్ సి విలియమ్స్ (Michael C Williams) పాత్రలో రోషన్ మేకా కనిపించనున్నారు. “భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా… హైదరాబాద్‌లో మాత్రం నిజాం పాలన కింద నలిగిపోతూ నవాబులకు సలాం కొట్టాల్సిందే” అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవడం వెంటనే ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమా కథలో బైరాన్‌పల్లి గ్రామం, అక్కడి ప్రజలు ఎదుర్కొన్న దమనకాండ కీలకంగా కనిపిస్తోంది.
నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు నేపథ్యంతో, ఓ యువకుడు ఫుట్‌బాల్ ఛాంపియన్ కావాలనే కలతో ముందుకు సాగడం కథగా చూపించారు. తమ ఊరిపై జరిగిన దాడులను గ్రామస్థులు ఎలా ఎదుర్కొన్నారు? ఫుట్‌బాల్ ఆటగాడిగా ఎదగాలని ఆశించే ఆ యువకుడు నిజాం సైనికుల దాడులను ఎలా తట్టుకున్నాడు? స్పోర్ట్స్‌కు, ఆ కాలపు రాజకీయ పరిస్థితులకు ఉన్న లింక్ ఏమిటి? అనే ప్రశ్నలు ట్రైలర్ అంతా ఆసక్తికరంగా నడిపిస్తున్నాయి. టీజర్‌లో లగాన్ (Lagaan) తరహా వైబ్స్ కనిపించగా, ట్రైలర్‌తో ఆ హైప్ పదింతలు పెరిగింది.
ఈ చిత్రంలో రోషన్ మేకా సరసన అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించగా, ఒకప్పటి స్టార్ హీరో నందమూరి కల్యాణ్ (Nandamuri Kalyan) రాజి రెడ్డి పాత్రలో కీలకంగా కనిపించనున్నారు. అర్చన (Archana) మరో ముఖ్య పాత్రలో నటించారు. మిక్కీ జే మేయర్ (Mickey J Meyer) సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం (Pradeep Advaitham) దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ (Zee Studios) సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిం బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఛాంపియన్ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments