Article Body
సీనియర్ నటుడు శ్రీకాంత్ మేక కుమారుడు రోషన్ మేక (Roshan Meka) హీరోగా, ప్రదీప్ అద్వైతం (Pradeep Advaitham) దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఛాంపియన్’ (Champion Movie) ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) బ్యానర్‌పై భారీ పెట్టుబడితో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. 1948 కాలం నేపథ్యంతో, ఫుట్‌బాల్ ఆధారిత కథను గ్రాండ్ విజువల్స్‌తో తెరకెక్కించినట్లు ట్రైలర్ స్పష్టంగా చూపిస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే ట్రైలర్‌కు మంచి స్పందన రావడం గమనార్హం.
‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న రోషన్ మేక, ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంపై మొదటి నుంచే ట్రేడ్ వర్గాల్లో పాజిటివ్ బజ్ ఉంది. కథ, నిర్మాణ విలువలు, టెక్నికల్ క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడలేదని ఇప్పటికే వినిపిస్తోంది. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ (Anaswara Rajan) కథానాయికగా నటిస్తుండగా, మిక్కీ జే మేయర్ (Mickey J Meyer) సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలవనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.
ట్రైలర్‌ను గమనిస్తే, స్వాతంత్ర్యానికి ముందు నిజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రం నేపథ్యంలో కథ సాగుతున్నట్లు తెలుస్తోంది. రజాకార్ల దౌర్జన్యాలు, ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, బైరాన్‌పల్లి గ్రామం చుట్టూ నడిచే కథను దర్శకుడు బలంగా ప్రెజెంట్ చేసినట్లు అనిపిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఎదిగిన ఓ యువకుడు ఫుట్‌బాల్ ఛాంపియన్‌గా ఎలా మారాడన్నదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. కోవై సరళ (Kovai Sarala), నరేష్ (Naresh), నందమూరి కల్యాణ్ చక్రవర్తి (Nandamuri Kalyan Chakravarthy) కీలక పాత్రల్లో కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తెలంగాణ యాసలో రోషన్ చెప్పిన డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. విజువల్ గ్రాండ్యూర్, ఎమోషన్, స్పోర్ట్స్ ఎలిమెంట్ అన్నీ కలిసి సినిమా ఓ ప్రత్యేక అనుభూతిని అందించబోతుందనే ఫీలింగ్ కలుగుతోంది. ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామ్ చరణ్ (Ram Charan) రోషన్ మేకపై ప్రశంసలు కురిపించారు. తన కెరీర్‌లో ‘మగధీర’ ఎంత కీలకమో, రోషన్‌కు ‘ఛాంపియన్’ కూడా అంతే ముఖ్యమైన సినిమా కావాలని ఆకాంక్షించారు. చరణ్ మాటలతో ‘ఛాంపియన్’పై అంచనాలు మరింత పెరిగాయని చెప్పాలి.

Comments