Article Body
హైదరాబాద్ (Hyderabad) లో సొంతింటి కల నెరవేర్చుకోవడం చాలామందికి ఇప్పటికీ ఒక కలగానే మిగిలిపోతోంది. పెరిగిపోయిన రియల్ ఎస్టేట్ ధరలు (Real Estate Prices) చూసి చాలా మంది మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాలు వెనకడుగు వేస్తుంటారు. అయితే ఇప్పుడు అలాంటి వారికోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు (Telangana Housing Board) ఒక అరుదైన అవకాశం తీసుకొచ్చింది. తక్కువ ఆదాయ వర్గాలైన ఎల్ ఐ జీ (LIG Category) కుటుంబాల కోసం హైదరాబాద్, వరంగల్ (Warangal), ఖమ్మం (Khammam) నగరాల్లో సిద్ధంగా ఉన్న సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లను తక్కువ ధరలకు విక్రయించేందుకు నిర్ణయించింది.
ఈ స్కీమ్‌లో మొత్తం 339 ఫ్లాట్లు (Flats) అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ ఇప్పటికే నిర్మాణం పూర్తై, మౌలిక వసతులతో సిద్ధంగా ఉన్న అపార్ట్‌మెంట్లలో ఉన్నాయి. గతంలో ప్రైవేట్ సంస్థలతో కలిసి హౌసింగ్ బోర్డు చేపట్టిన జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్స్ (Joint Venture Projects) లో ప్రభుత్వ వాటాగా వచ్చిన ఫ్లాట్లను ఇప్పుడు నేరుగా ప్రజలకు కేటాయిస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, ఓపెన్ మార్కెట్ ధరలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ ధరలకు లభిస్తున్నాయి.
నగరాల వారీగా చూస్తే, హైదరాబాద్ గచ్చిబౌలిలో (Gachibowli) 111 ఫ్లాట్లు, వరంగల్ రైల్వే స్టేషన్ (Warangal Railway Station) సమీపంలో 102 ఫ్లాట్లు, ఖమ్మం శ్రీరామ్ హిల్స్ (Sriram Hills Khammam) ప్రాంతంలో 126 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లాట్ల విస్తీర్ణం 450 చదరపు అడుగుల నుంచి 650 చదరపు అడుగుల వరకు ఉంటుంది. అన్నీ సింగిల్ బెడ్‌రూమ్ యూనిట్లే కావడం తక్కువ ఆదాయ కుటుంబాలకు అనుకూలంగా ఉంది.
ధరల విషయానికి వస్తే, గచ్చిబౌలిలో ఫ్లాట్ల ధరలు రూ.26 లక్షల నుంచి రూ.36.20 లక్షల వరకు ఉన్నాయి. వరంగల్‌లో రూ.19 లక్షల నుంచి రూ.21.50 లక్షల వరకు, ఖమ్మంలో కేవలం రూ.11.25 లక్షలకే ఫ్లాట్ లభిస్తోంది. ఏడాదికి రూ.6 లక్షల లోపు ఆదాయం (Annual Income Limit) ఉన్న కుటుంబాలు మాత్రమే అర్హులు. దరఖాస్తులు ఆన్‌లైన్ (Online Application) లేదా మీ-సేవా కేంద్రాల (Mee Seva Centers) ద్వారా చేయవచ్చు. దరఖాస్తు ఫీజుగా రూ.1 లక్ష చెల్లించాలి, ఇది పూర్తిగా రిఫండబుల్. దరఖాస్తు చివరి తేదీ జనవరి 3 కాగా, లాటరీ (Lottery Draw) తేదీలు జనవరి 6, 8, 10గా నిర్ణయించారు. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో (Official Website) అందుబాటులో ఉన్నాయి.

Comments