Article Body
దుల్కర్ సల్మాన్ తెలుగు ఆడియెన్స్ మధ్య ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి చిత్రాల ద్వారా రెట్రో కథలకైతే ఆయనే కేరాఫ్ అడ్రస్ అన్న పేరు వచ్చింది. అలాంటి సమయంలో రానా దగ్గుబాటి నిర్మించిన “కాంత” సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. ముఖ్యంగా 1950స్ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా మనకు క్లాసిక్ ఫీలింగ్ ఇస్తుందనుకున్నారు చాలా మంది. కానీ ఈ అంచనాలు ఎంతవరకు నిజమయ్యాయి? ఈ సినిమా దుల్కర్ కెరీర్‌లో రేర్ మిస్టేక్ ఎందుకయ్యిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ ఓల్లా తక్కువగా, భావోద్వేగాలు కొంత ఎక్కువగా ఉండేలా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ స్క్రీన్‌ప్లే నడిపించారు. “అయ్య” (సముద్రఖని) అనే సీనియర్ దర్శకుడు అనాథ బాలుడు TK మహదేవన్ (దుల్కర్ సల్మాన్) ను దత్తత తీసుకొని హీరోగా నిలబెడతాడు. కాలక్రమేణా మహదేవన్ పెద్ద స్టార్ అవుతాడు, తన గురువును మించి ఎదుగుతాడు. అప్పుడు ఇద్దరి మధ్య చిన్న చిన్న అహంకారాలు పుట్టి, ఎగో గొడవలు పెరిగి, “శాంతా” అనే సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. చాలా ఏళ్ల తరువాత కుమారి (భాగ్యశ్రీ బోర్సే) ప్రవేశంతో ఆ ప్రాజెక్ట్ తిరిగి ప్రారంభం అవుతుంది. కొత్త టైటిల్ “కాంత”. కానీ గురు–శిష్యుల అహంకారాలు, అవగాహన లోపాలు, తప్పుడు నిర్ణయాలు కథను ఎలా ముందుకు నడిపిస్తాయి అనేదే సినిమా.
సినిమా కథలోని ప్రధాన సమస్య ఏమిటంటే — కథనం చాలా స్లో, చెప్పే విధానం నీరసంగా ఉండటం. ఫస్ట్ హాఫ్ మొత్తం మహానటిలో ఉన్న దుల్కర్–సావిత్రి ట్రాక్‌ను గుర్తు చేసేలా అనిపిస్తుంది. రెట్రో ఫీల్, స్టేజ్ సెటప్, స్టార్ హీరో జర్నీ — ఇవన్నీ చూసి కొత్తదనం అనిపించదు. ఇండస్ట్రీ డ్రామా చూపించాలని ప్రయత్నించినా, దానిని లోతుగా రాయలేదు. గురు–శిష్యుల మధ్య విభేదాలు రావడానికి సరైన కారణమూ చూపించలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగానే ఉన్నా, సెకండ్ హాఫ్‌లో కథ మర్డర్ మిస్టరీగా మారిపోవడంతో, సినిమాకు ఏ దిశలో వెళ్తుందో అర్థం కాకుండా ఉంటుంది. కథను గెస్ చేయగలిగే అవకాశం చాలా ఎక్కువ. అయితే క్లైమాక్స్ మాత్రం భావోద్వేగపూరితంగా రాసుకుని, దుల్కర్ నటనతో హైలైట్ అయ్యింది.
నటీనటుల విషయానికి వస్తే, దుల్కర్ సల్మాన్ మరోసారి తన నటన శక్తిని నిరూపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్‌లో అతని పెర్ఫార్మెన్స్ అద్భుతం. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పాత్ర చిన్నదే అయినా ప్రభావం చూపింది. రానా దగ్గుబాటి గెస్ట్ రోల్ లో కనిపించినప్పటికీ మంచి ఇంపాక్ట్ ఇచ్చాడు. సముద్రఖని పాత్రలో ఫిట్ అయ్యాడు. మొత్తం తారాగణం తమ భాగం పూర్తి చేశారు. టెక్నికల్ వైపు చూస్తే — సినిమాటోగ్రఫీ అద్భుతం. 1950స్ కాలాన్ని స్టైలిష్‌గా చూపించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. కానీ పాటలు పెద్దగా గుర్తుండేలా లేవు. ఎడిటింగ్ ఇంకాస్త శార్ప్‌గా ఉండాల్సింది. ఆర్ట్ డైరెక్షన్ మాత్రం సినిమా మొత్తాన్ని భుజాన వేసుకున్నంత పెద్ద ప్లస్ పాయింట్.
మొత్తం మీద “కాంత” — అద్భుతమైన సెటప్, గొప్ప విజువల్స్ ఉన్నా, కథ బలహీనంగా ఉండడం వల్ల పూర్తిస్థాయి సంతృప్తి ఇవ్వలేని సినిమా. దుల్కర్, రానా, అద్భుత visuals తప్పిస్తే, సినిమా అందరినీ ఆకట్టుకునేంత గ్రిప్పింగ్‌గా లేదు. క్లైమాక్స్ మాత్రం కొంత మెరుపు చూపిస్తుంది కానీ ఆ ఒక్కటే సినిమాను నిలబెట్టడానికి సరిపోదు.

Comments