Article Body
భారతదేశంలో ఆధార్ కార్డు వినియోగం రోజు రోజుకు విస్తరిస్తూ కొనసాగుతోంది. బ్యాంకింగ్ నుండి సబ్సిడీల వరకు, మొబైల్ సిమ్ నుండి ప్రయాణ సౌకర్యాల వరకు ఆధార్ తప్పనిసరిగా ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా తీసుకునే నిర్ణయాలు సామాన్యులకు నేరుగా ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా ఆధార్ అప్‌డేట్ చేయకుండా నిర్లక్ష్యంగా ఉంచితే, పలు సేవలు నిలిచిపోయే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
ఆధార్‌ను మరింత తప్పనిసరి చేసే దిశగా కేంద్రం కసరత్తు:
ఇప్పటికే బ్యాంకులు, ప్రయివేటు సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరిగా అమలులో ఉంది. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త నిబంధనలతో ఆధార్ వినియోగం మరింత విస్తరించనుంది. ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటళ్లు, అపార్ట్‌మెంట్‌ల వంటి పబ్లిక్ ప్రదేశాల్లో కూడా ఆధార్ యాక్సెస్ తప్పనిసరి అయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ఎవరు ఏ ప్రదేశం సందర్శించినా, వారి ‘హాజరు సాక్ష్యం’గా ఆధార్ ఆధారిత సెక్యూరిటీ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇది సెక్యూరిటీ దృష్ట్యా చాలా కీలకమైన చర్యగా భావిస్తున్నారు.
ఆఫ్‌లైన్ ఆధార్ వెరిఫికేషన్ – UIDAI కొత్త టెక్నాలజీ:
ప్రస్తుతం ఆధార్ వెరిఫికేషన్ చేయాలంటే ఓటీపీ ఆధారంగా ఆన్‌లైన్ విధానం అందుబాటులో ఉంది. కానీ అనేక సందర్భాల్లో ప్రజలు తమ అసలు ఆధార్ కార్డు కలర్ జిరాక్స్ ఇవ్వాల్సి వస్తోంది. ఈ కాపీలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయని UIDAI అనేకసార్లు గుర్తించింది.
దీన్ని అరికట్టేందుకు UIDAI పూర్తిగా కొత్త విధానాన్ని సిద్ధం చేస్తోంది — అదే ఆఫ్‌లైన్ ఆధార్ వెరిఫికేషన్ యాప్.
ఈ యాప్‌లో వ్యక్తిగత వివరాలు కనిపించకుండా కేవలం ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే కనిపిస్తాయి. అంటే వ్యక్తి ప్రైవసీకి పూర్తి రక్షణ ఉంటుంది. ఈ టెక్నాలజీని ‘Proof of Presence’ అనే పేరుతో అభివృద్ధి చేస్తున్నారు.
సెక్యూరిటీ కోసం దేశవ్యాప్తంగా కొత్త వెరిఫికేషన్ విధానం:
ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, కేవలం రెస్టారెంట్లు మాత్రమే కాదు, స్టేడియాలు, సినిమా థియేటర్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ ఆఫీసులు, పెద్ద సంస్థలు, పబ్లిక్ ఈవెంట్లు వంటి అనేక ప్రదేశాల్లో కూడా దీనిని తప్పనిసరిగా అమలు చేసే అవకాశం ఉంది.
దీంతో ప్రతి వ్యక్తి ఎక్కడికి వెళ్లినా ఆధార్ ఆధారంగా ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.
ఇలా మారితే, ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డు ఎప్పుడూ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం కూడా తప్పదు.
ఆధార్ అప్‌డేట్ ఎందుకు తప్పనిసరి? ప్రజలకు ఇచ్చిన హెచ్చరిక:
కేంద్రం ప్రకారం — ఆధార్ అప్‌డేట్ చేయకుండా ఉంచితే పలు సమస్యలు వస్తాయని స్పష్టమైంది. మీ ఆధార్‌లో ఉన్న అడ్రస్, ఫోటో, ఇతర వివరాలు పాతబడితే పలు సేవలు లాక్ అయ్యే అవకాశముంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ప్రభుత్వ సబ్సిడీలు, ప్రభుత్వ పథకాలు, మొబైల్ సేవలు — ఈ అన్ని చోట్ల ఆధార్ తిరస్కరించబడే ప్రమాదం ఉంది.
ఆధార్ అప్‌డేట్ చేయడం కోసం UIDAI 10 సంవత్సరాల పాత ఆధార్‌లను తప్పనిసరిగా రీ-అప్‌డేట్ చేయాలని ఇప్పటికే సూచించింది. ఇప్పుడు కొత్త వెరిఫికేషన్ విధానం రావడంతో, అప్‌డేట్ చేయని ఆధార్‌లకు సేవలు నిరోధించబడే అవకాశం కూడా ఉంది.

Comments