Article Body
మన దేశంలో పెళ్లిళ్లు అంటే పండుగ వాతావరణం. బంధుమిత్రులు, అల్లరి, హంగామా – ఇవన్నీ కలిసిపోతేనే ఆ వేడుక పూర్ణం అవుతుంది. అయితే టెక్నాలజీ యుగంలో ఈ సంప్రదాయాలూ నూతన రూపం దాలుస్తున్నాయి. తాజాగా కేరళలో జరిగిన ఓ వివాహ వేడుకలో వధువు తండ్రి చేసిన వినూత్న ప్రయోగం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఆయన తన కుమార్తె పెళ్లిలో చొక్కా జేబుపై పేటీఎం QR కోడ్‌ను అతికించుకొని అతిథులకు డిజిటల్‌గా చదివింపులు స్వీకరించారు.
ఈ సంఘటన “డిజిటల్ ఇండియా వెడ్డింగ్ ఎడిషన్” అనే పేరుతో వైరల్‌గా మారింది. పెళ్లికి హాజరైన బంధువులు, స్నేహితులు సంప్రదాయ కవర్లలో డబ్బు పెట్టి ఇవ్వకుండా, తమ మొబైల్‌ఫోన్‌లతో QR కోడ్‌ను స్కాన్ చేసి డిజిటల్ రూపంలో బహుమతులు పంపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవ్వగానే నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఈ ఆధునిక ఆలోచనను ప్రశంసిస్తూ “ఇది నిజమైన టెక్-సేవీ ఇండియా వెడ్డింగ్” అని అన్నారు. మరికొందరు “ఇక నుంచి చిల్లర సమస్యే లేదు – కేవలం స్కాన్‌లు, శుభాకాంక్షలే!” అంటూ సరదాగా కామెంట్లు పెట్టారు.
అనేక మంది ఈ విధానాన్ని పర్యావరణహితంగా అభివర్ణించారు. “కాగితపు కవర్ల వాడకం తగ్గుతుంది, పేపర్ వేస్ట్ లేకుండా, స్మార్ట్ పద్ధతిలో బహుమతులు ఇవ్వొచ్చు” అని కొందరు అభినందించారు. కేరళ వంటి 100 శాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రం నుంచి ఇలాంటి ఆలోచన రావడం సహజమని మరికొందరు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇది ఆధునికతను సంప్రదాయంతో మిళితం చేసే ఒక కొత్త దిశ అని అన్నారు.
అయితే అందరూ సానుకూలంగానే స్పందించలేదు. కొందరు నెటిజన్లు ఈ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “పెళ్లి లాంటి పవిత్రమైన వేడుకలో డిజిటల్ లావాదేవీలు చేయడం సరైనదా?”, “ఇది మన సంస్కృతికి విరుద్ధం కాదు?” అంటూ ప్రశ్నించారు. ఇంకొందరు “ఇది అడుక్కోవడంలో కొత్త పద్ధతి లాంటిది” అని విమర్శించారు. కవర్ ఇచ్చి ఆశీర్వదించే ఆత్మీయత ఈ స్కాన్‌లలో కనిపించదని వారు అభిప్రాయపడ్డారు.
ఈ సంఘటన ఒక్క కేరళలోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. టెక్నాలజీ రోజురోజుకీ మన జీవనశైలిలో మార్పులు తీసుకువస్తోంది. పెళ్లిలాంటి వేడుకల్లో కూడా ఇప్పుడు “డిజిటల్ ఎరా” ప్రారంభమైందని చెప్పవచ్చు. ఒకవైపు ఇది సమయోచిత పరిణామం, మరోవైపు మన సంప్రదాయ విలువలపై మెల్లగా ప్రభావం చూపే అంశం. భవిష్యత్తులో “డిజిటల్ పెళ్లిళ్లు” భారతీయ వివాహాల కొత్త రూపంగా మారతాయా అన్నది చూడాలి.
Brides Father 🤣* in Kerala
— சங்கரிபாலா (@sankariofficial) October 29, 2025
New Marriage Trend 🙏🙏
தட் மணமகளின் அப்பா …
செலவு அப்படிங்க…!!!! pic.twitter.com/94HbpvXrJn

Comments