Article Body
భారత క్రికెట్ స్టార్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కానీ ఈసారి కారణం ఆయన క్రికెట్ ప్రదర్శన కాదు — ఆయన వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న వివాదం. షమీకి దూరంగా ఉంటున్న భార్య హసీన్ జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు మరియు కుమార్తెకు ఇచ్చే నెలవారీ భరణం రూ.4 లక్షలు సరిపోవడం లేదని, దాన్ని రూ.10 లక్షలకు పెంచాలని ఆమె కోరారు.
2018లో షమీపై గృహహింస, వేధింపుల ఆరోపణలతో హసీన్ జహాన్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అప్పటి నుంచి ఈ దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. మొదట ట్రయల్ కోర్టు షమీకి నెలకు రూ.1.30 లక్షల మధ్యంతర భరణం చెల్లించాలని ఆదేశించింది. కానీ 2025 జూలైలో కలకత్తా హైకోర్టు ఆ మొత్తాన్ని రూ.4 లక్షలకు పెంచింది. ఇందులో రూ.1.5 లక్షలు హసీన్ జహాన్‌కి, రూ.2.5 లక్షలు కుమార్తెకు కేటాయించారు.
అయితే ఈ మొత్తం సరిపోకపోతుందని హసీన్ జహాన్ భావిస్తున్నారు. అందుకే ఆమె సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. తాను మరియు కుమార్తె కోసం నెలకు రూ.10 లక్షలు కావాలని ఆమె డిమాండ్ చేశారు. తన అభ్యర్థనలో హసీన్ జహాన్, షమీ ఆర్థిక స్థితిని ప్రధాన కారణంగా చూపించారు. ఆమె వాదన ప్రకారం షమీ ఒక A-లిస్టెడ్ నేషనల్ క్రికెటర్, ఆయన నికర సంపద దాదాపు రూ.500 కోట్లు అని పేర్కొన్నారు.
“ఇతర ఎలైట్ క్రికెటర్ల కుటుంబాలు ఏ స్థాయిలో జీవిస్తారో, మేము కూడా ఆ స్థాయిలో జీవించే హక్కు కలిగినవారమే. కానీ షమీ నుండి తగిన మద్దతు లభించడం లేదు” అని హసీన్ జహాన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆమె చెప్పిన ప్రకారం, రూ.4 లక్షలు తమ జీవన ప్రమాణాన్ని కొనసాగించడానికి సరిపోవడం లేదని తెలిపారు.
ఈ కేసు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు విచారణకు రాగా, జస్టిస్ మనోజ్ మిశ్రా మరియు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని బెంచ్ హసీన్ జహాన్ న్యాయవాదులను ఉద్దేశించి “నెలకు రూ.4 లక్షలు కూడా సరిపోవట్లేదా?” అని ప్రశ్నించింది. అయితే తుది నిర్ణయం ఇవ్వకుండా కోర్టు ఈ కేసుపై మరింత విచారణ జరపాలని నిర్ణయించింది.
కోర్టు మహ్మద్ షమీ, అలాగే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ తేదీని త్వరలో నిర్ణయించనుంది. ప్రస్తుతం షమీ బిజీగా తన క్రికెట్ కెరీర్ కొనసాగిస్తుండగా, ఈ కేసు మరోసారి ఆయన వ్యక్తిగత జీవితంపై దృష్టిని సారించింది.
ఈ వివాదం మళ్లీ మీడియా దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో అభిమానులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు షమీకి మద్దతు ఇస్తుండగా, మరికొందరు హసీన్ జహాన్ అభ్యర్థనను సమర్థిస్తున్నారు.
ఏదేమైనా, ఈ కేసు తీర్పు భవిష్యత్తులో క్రికెటర్ల వ్యక్తిగత వివాదాల పరిధిలో కొత్త దిశను చూపే అవకాశం ఉంది.

Comments