Article Body
తెలంగాణలో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై ఫిర్యాదు దాఖలైంది. 'వారణాసి' ఈవెంట్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని రాష్ట్రీయ వానరసేన సభ్యులు ఆరోపించారు. హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదు నమోదు అయింది. అయితే ఇప్పటివరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు.
వివరాల్లోకి వెళితే—నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ‘గ్లోబ్ ట్రాట్టర్’ ఈవెంట్లో ‘వారణాసి’ సినిమా అప్‌డేట్ విడుదల సమయంలో చిన్న టెక్నికల్ సమస్య ఏర్పడింది. దీని పై స్పందిస్తూ రాజమౌళి, “నాకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు. మా నాన్నగారు హనుమంతుడు వెనకాల ఉంటాడని అనగానే, ఇది ఏమిటి నడిపించేది అని కోపం వచ్చింది” అని అన్నారు. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద హంగామా చేపట్టింది.
రాజమౌళి వ్యాఖ్యలు త్వరగా వైరల్ అవ్వడంతో వేలాది మంది నెటిజన్లు స్పందించారు. హనుమంతుడిని అవమానించే విధంగా ఉందని, చిన్న సమస్యకు దేవుని పేరును తీసివ్వడం అవమానకరమని ట్రోలింగ్ మొదలయ్యింది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో #RespectHanuman హ్యాష్‌ట్యాగ్‌తో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రీయ వానరసేన సంఘం నేతలు రాజమౌళిపై అధికారిక ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చారు. “హిందూ దేవుళ్లపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు రావకుండా చర్యలు తీసుకోండి” అని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సంఘ సభ్యులు రాజమౌళి ప్రజల్లో క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు.
ప్రస్తుతం పోలీసులు ఫిర్యాదును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేస్తారా, లేదా అనేది ఇంకా తెలియలేదు. అయితే ఈ ఈ విషయం ‘వారణాసి’ సినిమా ఈవెంట్ హైప్‌ను మించిపోయి పెద్ద వివాదంగా మారింది. రాజమౌళి స్పందిస్తారా? క్షమాపణ చెబుతారా? లేక వివరాలు ఇస్తారా? అనే అనుమానాల మధ్య సోషల్ మీడియాలో ఈ వివాదం వేడి పుట్టిస్తోంది.

Comments