Article Body
తాప్సీ పన్నూ (Taapsee Pannu) అంటే తెలుగు సినిమా ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఝుమ్మంది నాదం (Jhummandi Naadam) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, తొలి చిత్రంతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌ను విస్తరించిన తాప్సీ, చివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో (Bollywood Industry) స్థిరపడింది. అక్కడ కూడా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో తనదైన ముద్ర వేసింది.
తెలుగులో కొంతకాలం బిజీగా సినిమాలు చేసిన తాప్సీ, ఆ తర్వాత పూర్తిగా హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. బాలీవుడ్‌లో వరుస హిట్స్ అందుకున్నప్పటికీ, పెళ్లి తర్వాత ఆమె సినిమాల సంఖ్య కొంత తగ్గింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ పన్నూ తన కెరీర్‌కు సంబంధించిన షాకింగ్ విషయాలను వెల్లడించింది. తన సహజమైన రింగుల జుట్టు (Curly Hair) కారణంగా అనేక అవకాశాలు కోల్పోయానని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె చెప్పింది. సినిమాల్లో గ్లామర్ అంటే కేవలం జుట్టు నిటారుగా ఉండడమే అన్న మూసధోరణి తనను తీవ్రంగా బాధించిందని పేర్కొంది.
కెరీర్ ప్రారంభ దశలో ప్రతి దర్శకుడు తన జుట్టును స్ట్రెయిట్ చేయించుకోవాలని చెప్పేవారని తాప్సీ వెల్లడించింది. చాలాకాలం పాటు గ్లామర్, స్టైలిష్ లుక్ అంటే స్ట్రెయిట్ హెయిర్ (Straight Hair) మాత్రమే అనే ఆలోచన ఇండస్ట్రీలో బలంగా ఉండేదని తెలిపింది. రింగుల జుట్టు ఉన్న అమ్మాయిని రెబల్ లేదా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకు మాత్రమే సరిపోతుందని భావించేవారని, పాజిటివ్ రోల్స్‌కు పనికిరాదని అనుకునేవారని ఆమె చెప్పింది. కెరీర్ మొదట్లో అవకాశాల కోసం తాను కూడా జుట్టు స్ట్రెయిట్ చేయించుకోవడానికి అంగీకరించానని, కానీ ఆ తర్వాత అది తనకు ఇబ్బందిగా మారిందని పేర్కొంది.
సినిమాలే కాకుండా బ్రాండ్ యాడ్స్ (Brand Ads) విషయంలో కూడా ఇదే సమస్య ఎదురైందని తాప్సీ చెప్పింది. చాలా పెద్ద బ్రాండ్స్ తనతో యాడ్స్ చేయాలనుకున్నప్పటికీ, రింగుల జుట్టు కాకుండా స్ట్రెయిట్ హెయిర్ కావాలని షరతు పెట్టారని తెలిపింది. అలాంటి ఆఫర్స్‌ను తాను తిరస్కరించినట్లు వెల్లడించింది. అందమైన జుట్టు అంటే రింగుల జుట్టు కాదు అన్న ఆలోచన తనను తీవ్రంగా నిరాశపరిచిందని, చిన్నప్పటినుంచి తన జుట్టును అసహ్యించుకున్నానని చెప్పింది. అయితే తర్వాత తన సహజత్వాన్ని అంగీకరించి, అదే తన బలంగా మార్చుకున్నానని తెలిపింది. తాప్సీ చివరగా అక్షయ్ కుమార్ (Akshay Kumar) సరసన ఖేల్ ఖేల్ మే (Khel Khel Mein) చిత్రంలో కనిపించింది.

Comments