Article Body
శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన భారతీయ రైల్వేస్ (Indian Railways) భారత ప్రజల జీవితంలో విడదీయలేని భాగంగా మారింది. శుభకార్యమైనా, అశుభకార్యమైనా ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడంలో రైలు కీలక పాత్ర పోషిస్తోంది. లగ్జరీ బస్సులు, కార్లు, విమానాలు ఉన్నా కూడా చాలా మంది ఇప్పటికీ రైలు ప్రయాణానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే భారతీయులకు రైల్వేతో ఒక ఎమోషనల్ బాండ్ ఏర్పడింది.
ప్రస్తుతం భారతీయ రైల్వేస్ వద్ద సుమారు 1,14,500 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ఉంది. దీంతో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా నిలిచింది. ఉద్యోగుల పరంగానూ ఇండియన్ రైల్వే (Indian Railway Employees) రికార్డులు సృష్టిస్తోంది. సుమారు 1.2 మిలియన్ ఉద్యోగులతో ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో, దేశంలో రెండో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా చిన్న పెద్ద కలిపి దాదాపు 7,500 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో కొన్ని వందేళ్ల చరిత్ర కలిగినవైతే, మరికొన్ని అత్యాధునిక సదుపాయాలతో తాజాగా అభివృద్ధి చేసినవిగా ఉన్నాయి.
ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా హౌరా జంక్షన్ (Howrah Junction) నిలుస్తుంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా (Kolkata) మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఉన్న ఈ స్టేషన్ 1853లో నిర్మితమైంది. ప్రస్తుతం ఇందులో 23 ప్లాట్‌ఫార్ములు, 25 ట్రాక్స్ ఉన్నాయి. ప్రతిరోజూ సుమారు 600 రైళ్లు ఈ స్టేషన్ గుండా ప్రయాణిస్తాయి. హౌరా తర్వాత రెండో స్థానంలో సెల్దా రైల్వే స్టేషన్ (Sealdah Railway Station) ఉంది. ఇదీ కోల్‌కతాలోనే ఉండటం విశేషం. రోజుకు దాదాపు 15 లక్షల మంది ప్రయాణికులు ఇక్కడ రాకపోకలు సాగిస్తారు.
మూడో స్థానంలో ముంబైలోని చత్రపతి శివాజీ టెర్మినస్ (Chhatrapati Shivaji Terminus) నిలుస్తుంది. ఇది యునెస్కో (UNESCO World Heritage Site) గుర్తింపు పొందిన స్టేషన్. నాలుగో స్థానంలో దేశ రాజధానిలోని న్యూడిల్లీ రైల్వే స్టేషన్ (New Delhi Railway Station) ఉండగా, ఐదో స్థానంలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ (Chennai Central Railway Station) నిలిచింది. ఈ స్టేషన్లన్నీ రవాణా పరంగానే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా కీలకంగా మారాయి.

Comments